Hyderabad

CID intensifies investigation into irregularities in 'Dharani' and 'Bhu-Bharati' portals! Illegal transfer of land spanning hundreds of acres

CID intensifies investigation into irregularities in 'Dharani' and 'Bhu-Bharati' portals! Illegal transfer of land spanning hundreds of acres

By ·

Share this article
CID intensifies investigation into irregularities in 'Dharani' and 'Bhu-Bharati' portals!  Illegal transfer of land spanning hundreds of acres

 

 

ధరణి, భూభారతిల అవకతవకలపై                                                                     

సీఐడీ దర్యాప్తు ముమ్మరం!                                                                       

 వందల ఎకరాల్లో భూమి అక్రమ మార్పిడి
 
 
టీమీడియా , నవంబర్ 18,  హైదరాబాద్​  బ్యూరో : ధరణి, భూభారతి పోర్టళ్లలోని లోపాలను ఆసరాగా చేసుకొని, భూముల అక్రమ మార్పిడికి పాల్పడిన ముఠాల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తొలుత సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరులో దాదాపు 3 ఎకరాల భూమిని అక్రమ మ్యుటేషన్‌పై తెలంగాణ సీఐడీ దర్యాప్తు ప్రారంభించిన నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా పలుప్రాంతాల్లో ఈ తరహా అక్రమాలు బయటపడుతున్నాయి. కొల్లూరు కేసులో సీఐడీ రెండు విడతలుగా 9 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరికొన్ని అక్రమ మ్యుటేషన్లకు సంబంధించి రెవెన్యూ అధికారుల నుంచి సీఐడీకి ఫిర్యాదులు అందుతున్నాయి.

ఇప్పటివరకు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని కూకట్‌పల్లి, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు, అమీన్‌పూర్, తెల్లాపూర్, అందోలు, నిజామాబాద్‌ జిల్లా చందూర్‌ తదితర ప్రాంతాల్లో వందల ఎకరాలను పలు ముఠాలు అక్రమంగా మార్పిడి చేశారని సీఐడీ గుర్తించినట్లు సమాచారం. ఆ ముఠాల కార్యకలాపాలపై దృష్టిసారించిన దర్యాప్తు సంస్థ అక్రమ మ్యుటేషన్ల వివరాలు రాబట్టే పనిలో పడింది.

భూభారతి, ధరణి అవకతవకలపై దర్యాప్తు ముమ్మరం
కూకట్‌పల్లి తహసీల్దార్‌ కార్యాలయం పరిధిలోని భూములకు సంబంధించి భూభారతి పోర్టల్‌లో కొన్ని దరఖాస్తులు ఎలాంటి రిపోర్ట్​లు లేకుండానే ప్రాసెస్‌ అయినట్లుగా అధికారులు గుర్తించారు. మహ్మద్‌ గౌస్‌ అనే వ్యక్తి పేరితో భూభారతి వెబ్​సైట్​లో రెండు దరఖాస్తులు నమోదయ్యాయి. కూకట్‌పల్లి గ్రామంలోని సర్వే నంబర్‌ 1070/1 లోని రెండు ఎకరాల 39 గుంటలు, 1070/2 సర్వే నంబర్​లోని ఒక గుంట భూమికి సంబంధించి పట్టాదారు పాస్‌బుక్​లు లేకుండా నాలా కన్వర్షన్‌కు సంబంధించి ఆ దరఖాస్తులున్నాయి. మొదటి దరఖాస్తు డిజిటల్‌ సైన్ పెండింగ్‌లో ఉన్నట్లు భూభారతి పోర్టల్‌లో చూపిస్తుండగా, రెండో దరఖాస్తుకు సంబంధించి ఈ ఏడాది జూన్‌ 22న నాలా కన్వర్షన్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా రెవెన్యూ అధికారుల పరిశీలనలో తెలిసింది. పట్టాదారు పాసుపుస్తకాలు లేకుండా నాలా కన్వర్షన్‌ కోసం వచ్చిన మరో 4 దరఖాస్తులనూ గుర్తించారు.

ఈ నాలుగు భూభారతి ఆపరేటర్‌ లాగిన్‌లో ‘పెండింగ్‌ ఫర్‌ క్యాప్చర్‌ బయోమెట్రిక్‌ అండ్‌ ఫొటో’ అనే స్థితిలో ఉన్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ ఆరు దరఖాస్తులు కూకట్‌పల్లి తహసీల్దార్‌ నుంచి ముందస్తు అనుమతి గానీ, నివేదిక గానీ లేకుండానే ప్రాసెస్‌ అయినట్లుగా తేలింది. రికార్డులను పరిశీలించగా ఆయా దరఖాస్తులేవీ తహసీల్దార్‌ కార్యాలయానికి అందలేదని వెల్లడి కావడంతో కేపీహెచ్‌బీ పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కూడా సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసింది.

విశ్రాంత డీజీపీ భూమికి ఎసరు
అందోలు మండలంలోని సంగుపేటలో మాజీ డీజీపీకి సంబంధించిన భూమిని ఆయనకు తెలియకుండానే ఇతరులకు కట్టబెట్టిన వ్యవహారం కలకలం రేపుతోంది. తెలంగాణ కేడర్‌కు చెందిన ఆ విశ్రాంత డీజీపీకి చెందిన దాదాపు 4.5 ఎకరాల భూమిని అలీ గ్యాంగ్ అక్రమంగా ఇతరుల పేరు పైకి మ్యుటేషన్‌ చేసినట్లు సీఐడీకి ఫిర్యాదు అందింది. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి అయిన ఆయన భార్య ఫిర్యాదు చేయగా అలీతోపాటు ముఠాకు చెందిన పలువురిని సీఐడీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా సమాచారం. ధరణి, భూభారతి ఆపరేటర్లుగా పనిచేసిన ప్రైవేటు వ్యక్తులకు డబ్బులు ఎరగా వేసి ఈ ముఠా భూ అక్రమమార్పిళ్లకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారని సమాచారం. నిజామాబాద్‌ జిల్లా చందూరుకు సంబంధించిన భూ అక్రమ వ్యవహారంలోనూ పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

Tags: