hyderabad

An assurance of Rs. 5 lakh for every family... Starting on the 19th

An assurance of Rs. 5 lakh for every family... Starting on the 19th

By ·

Share this article
An assurance of Rs. 5 lakh for every family...   Starting on the 19th

 

 

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల భరోసా..  

19 న ప్రారంభం

 

టీమీడియా , నవంబర్ 18,  హైదరాబాద్​  బ్యూరో : తెలంగాణలోని కోటి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా అందించాలనే లక్ష్యంతో ‘ఇందిరమ్మ బీమా’ పథకాన్ని అమల్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న బీమా పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 19న సిద్ధిపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఇందిరమ్మ బీమా దరఖాస్తును ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఇదే వేదికగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టనున్నారు.

కోటి కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా
ఇందిరమ్మ బీమా పథకం ద్వారా రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ప్రయోజనం కలిగేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు, పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం అండగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు వేర్వేరుగా బీమా పథకాలను అమలు చేస్తున్నాయి. వీటిలో కొన్ని పథకాల కింద రూ.2 లక్షల జీవిత బీమా, ప్రమాద బీమా కింద గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు ప్రయోజనాలు అందుతున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీమా ప్రయోజనాలు పొందుతున్న వారందరినీ కొత్త విధానంలోనూ కొనసాగించాలని రేవంత్ రెడ్డి సూచించారు.

ప్రస్తుతం అందుతున్న ప్రమాద బీమా ప్రయోజనాల్లో ఎలాంటి కోత విధించకుండా యథాతథంగా కొనసాగించాలని సీఎం ఆదేశించారు. అదే సమయంలో కొన్ని శాఖల్లో అమలవుతున్న రూ.2 లక్షల జీవిత బీమాను ఇందిరమ్మ బీమా పరిధిలోకి తీసుకొచ్చి రూ.5 లక్షలకు పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు ప్రభుత్వ బీమా భద్రత పొందుతున్న ఒక్క లబ్ధిదారుడూ కొత్త విధానంలో అనర్హుడిగా మారకూడదని స్పష్టం చేశారు.

అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు
మరోవైపు రాష్ట్రంలోని అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సిద్ధిపేట సభలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం చీరలను వెంటనే అన్ని జిల్లాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పంపిణీ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా జిల్లా యంత్రాంగాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. చీరల పంపిణీలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. అర్హులైన మహిళలందరికీ ఈ పథకం ప్రయోజనం చేరేలా చూడాలని స్పష్టం చేశారు.

గ్రామస్థాయిలోనే దరఖాస్తులు.. విస్తృత ప్రచారం
ఇందిరమ్మ బీమా పథకంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయి నుంచి ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. దరఖాస్తు ప్రక్రియ ప్రజలకు సులభంగా ఉండేలా గ్రామాల్లోనే దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు పథకంపై విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు అమలు ఏర్పాట్లను పర్యవేక్షించాలని తెలిపారు. ఇందిరమ్మ బీమా, ఇందిరమ్మ చీరల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు.

మొత్తంగా.. ఇందిరమ్మ బీమా ద్వారా కోటి కుటుంబాలకు జీవిత బీమా భరోసా కల్పించడం, ఇందిరమ్మ చీరలతో అర్హులైన మహిళలకు ప్రయోజనం అందించడం లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సిద్ధిపేట సభ వేదికగా ఈ రెండు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి.

Tags: