కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ
పాత కాంట్రాక్టర్‌కే రూ.4200 కోట్ల పనులు!
టీ మీడియా,నవంబర్13,హైదరాబాద్ బ్యూరో : కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి రూ.4200 కోట్ల పనులను పాత కాంట్రాక్టర్‌కే ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. గురువారం సంబంధిత కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమావేశంలో నీటి పారుదల శాఖ కార్యదర్శి ఈ మేరకు సమాచారం ఇచ్చి పనులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. పరిపాలన అనుమతులు, మంత్రివర్గ ఆమోదం తదితర పక్రియల తర్వాత అధికారికంగా ఆదేశాలిస్తామని, ఈలోగా యంత్రాల సమీకరణ, క్యాంపుల ఏర్పాటుకు భూ సమీకరణ తదితర పనులు ప్రారంభించాలని తెలిపినట్లు సమాచారం.
మేడిగడ్డ మరమ్మతులపై
మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ భూమి లోపలికి కుంగడం, భారీ పియర్స్ దెబ్బతినడం, పైపింగ్ తదితరాలపై విచారించిన విజిలెన్స్ విభాగం బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేయడం, మరోవైపు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పునరుద్ధరణకు అయ్యే ఖర్చును నిర్మాణ సంస్థ నుంచే వసూలు చేయాలని సూచించిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కొత్త సంస్థకు కాకుండా బ్యారేజీ నిర్మించిన సంస్థతోనే పనులు చేయించడం ద్వారా జాప్యాన్ని నివారించవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పని పూర్తయినట్లు ఈ సంస్థకు ఇచ్చిన సర్టిఫికెట్‌ను కూడా ప్రస్తుత ప్రభుత్వం గతంలోనే రద్దు చేసింది.
అయితే జస్జిస్ పీసీ ఘోష్ సిఫార్సు చేసినట్లుగా మేడిగడ్డ వరకు మళ్లీ చేయాల్సిన పనులకు నిర్మాణ సంస్థ నుంచి సొమ్ము రికవరీ చేయాలని కొందరు అధికారులు సర్కారుకు స్పష్టం చేసినట్లు సమాచారం. దీనికి నిర్మాణ సంస్థ అంగీకరిస్తుందో లేదో అన్నది వేచి చూడాల్సిందే. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులను పాత ఏజెన్సీలకే ఇవ్వనున్నట్లు స్పష్టమైంది.
కేబినెట్ మంత్రులతో ఇటీవల సీఎం సమావేశమైన సందర్భంగా మూడు బ్యారేజీల పరిస్థితి, నీటిని ఎత్తిపోయలేకపోవడానికి కారణాలు, పునరుద్ధరణ పనుల గురించి పూర్తిగా విశ్లేషించారు. దీనికి కొనసాగింపుగా గురువారం నీటి పారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్ వద్ద జరిగిన సమావేశంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ సంస్థలు ఎల్ అండ్ టీ, అప్కాన్స్, నవ యుగ సంస్థల ప్రతినిధులు, ప్రత్యేక కార్యదర్శి పరీక్షిత్ మెహ్రా, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్, ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నట్లు తెలిసింది.
బ్యారేజీలకు సంబంధించి గతంలో చేసిన పనులకు సంబంధించిన మరమ్మతులకు అయ్యే ఖర్చును ఏజెన్సీలే భరించాలని, అదనంగా చేయాల్సిన పనులకు ప్రభుత్వం చెల్లిస్తుందని అధికారులు ఆయా సంస్థలకు తెలిపినట్లు సమాచారం. స్టీలింగ్ బేసిన్ విస్తరణ, దీనికి తగ్గట్లుగా పియర్స్ విస్తరణ, సీసీ బ్లాకులు, ఆర్‌సీసీ డయాఫ్రం కట్ ఆఫ్ వాల్ నిర్మాణం తదితర పనులన్నీ అదనపు పనులు చేసే లిస్ట్‌లో ఉన్నాయి. డిఫెక్ట్ లయబిలిటీ పిరియడ్‌ను అదనపు పనులకు మాత్రమే కాకుండా బ్యారేజీలకు కూడా పొడిగించాల్సి ఉంటుందని అధికారులు సూచించారు. దీనిపై నిర్మాణ సంస్థలు తుది నిర్ణయానికి రావాల్సి ఉందని నీటి పారుదల శాఖ అధికార వర్గాలు తెలిపాయి.
మేడిగడ్డ వద్ద 82 వేల క్యూసెక్కులే!
మేడిగడ్డ బ్యారేజీని గతంలో డిజైన్ చేసినట్లుగా ప్రస్తుతం కూడా 82 వేల క్యూసెక్కులే ఉండాలని కేంద్ర జలసంఘం స్పష్టం చేసినట్లు తెలిసింది. 2023లో సీడబ్ల్యూసీ డేటా ఆధారంగా మేడిగడ్డ వద్ద 72 వేల క్యూసెక్కుల వరద ప్రవాహానికి డిజైన్ చేస్తే సరిపోతుందని డిజైనర్ కన్సల్టెన్సీ సంస్థ ఆప్రీ ప్రతిపాదించగా ఆమోదం కోసం నీటి పారుదల శాఖ కేంద్ర సీడబ్ల్యూసీకి పంపింది.
72 వేల క్యూసెక్కులకు ఆమోదిస్తే ఏడో బ్లాక్ పూర్తిగా తొలగించకుండా నాన్ ఓవర్‌ఫ్లో బ్యారేజీగా మార్చితే సరిపోతుందని అధికారులు భావించారు. అయితే సీడబ్ల్యూసీ మాత్రం మేడిగడ్డ వద్ద 82 వేల క్యూసెక్కులకే డిజైన్ ఉండాలని స్పష్టం చేసినట్లు నీటిపారుదలశాఖ వర్గాల ద్వారా సమాచారం తెలిసింది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే ఏడో బ్లాక్‌ను పూర్తిగా పునరుద్ధరించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అధిక వ్యయం మేడిగడ్డకే
పునరుద్ధరణ పనులకు ట్యాక్స్‌లతో కలిపి మేడిగడ్డ బ్యారేజీకి రూ.1,883 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అన్నారం బ్యారేజీకి రూ.1205 కోట్లు, సుందిళ్లకు రూ.1160 కోట్లు అవుతుందని ఇంజినీరింగ్ అధికారులు తేల్చారు. గతంలో బ్యారేజీల నిర్మాణానికి అయిన ఖర్చులో 60 శాతం వరకు పునరుద్ధరణకు వెచ్చించాల్సి ఉంటుందని, ఇంత భారీ మొత్తం పనులు నామినేషన్ పద్ధతిలో ఇవ్వడంపై చర్చ జరిగినా వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి పునరుద్ధరణ పనుల్లో పురోగతి సాధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మేడిగడ్డ ఏడో బ్లాక్‌ను పూర్తిగా బాగు చేయాలంటే మరింత వ్యయమవుతుంది. అయితే ఈ భారాన్ని మోయడానికి నిర్మాణ సంస్థ ముందుకొస్తుందా? లేదా? అనే అంశాలను చూడాల్సి ఉంది.






