ఎమ్మెల్సీలు 30 మంది ఆశావహులు
కొత్త ఇంఛార్జ్ బీఎం సందీప్‌పై కీలక బాధ్యతలు
టీమీడియా , నవంబర్ 17, హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా నియమితులైన బీఎం సందీప్‌పై రాబోయే రెండేళ్ల పాటు కీలక బాధ్యతలు ఉన్నాయి. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు 3 ఖాళీ అయ్యే శనివారం రోజే ఆయనను ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జిగా నియమించడం గమనార్హం. ఈ 3 ఎమ్మెల్సీ స్థానాల కోసం కనీసం 30 మందికి పైగా నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా వివిధ సామాజిక వర్గాల సమతౌల్యంతో వీటికి అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత ఈ నూతన ఇంఛార్జిపైనే ఉంటుంది.
మరోవైపు వచ్చే మార్చిలోగా రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న సామ రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిలను గెలిపించడానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలను సమన్వయ పరిచే బాధ్యత కూడా సందీప్‌పై ఉన్న మరో కీలక బాధ్యత అని నాయకులు చెబుతున్నారు.
నామినేటెడ్ పదవుల భర్తీకి ఎదురుచూపులు
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కార్పొరేషన్లతో పాటు ఇతర నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. వారి రెండేళ్ల పదవీ కాలం కూడా గత జులై నెలలోనే ముగిసింది. వారంతా మరోసారి పదవీ కాలం పొడిగించాలని సీనియర్ నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. వారిలో పార్టీ కోసం పని చేసిన కొద్దిమందికి మాత్రమే పదవీకాలం పొడిగించి, మిగిలిన పదవులను కొత్తవారికి ఇవ్వాలని కీలక నాయకులు ఆలోచిస్తున్నారు.
నామినేటెడ్ పదవులకు కొత్తవారి ఎంపిక ఎలాంటి వివాదాలు లేకుండా పక్కాగా జరిగేలా చూడాల్సిన బాధ్యత కూడా సందీప్‌పైనే ఉంది. మరోవైపు ఇటీవల పీసీసీ అధికార ప్రతినిధులుగా కొందరిని నియమిస్తూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించిన జాబితాను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నిలిపివేసిన సంగతి తెలిసిందే.
సాంకేతిక కారణాలతో ఆపివేసినట్లు
పీసీసీ అధికార ప్రతినిధుల నియామకం కోసం ఏఐసీసీ ఆమోదం పొందాల్సి ఉందని, సాంకేతిక కారణాలతో ఆపివేసినట్లు మహేశ్ గౌడ్ తెలిపారు. కానీ తమ వారిని కూడా అధికార ప్రతినిధులుగా నియమించాలని పలు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీలు కోరుతున్నారు. అందరిని సంతృప్తపరిచేలా కొత్త జాబితాను మళ్లీ విడుదల చేయడానికి కూడా కొత్త ఇంఛార్జి ముమ్మర చర్యలు తీసుకోవాల్సి ఉంది.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల కోసం బడా నేతలు రేసులో ఉన్నారు. పీసీసీ రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా పూర్తిస్థాయిలో నియమించాల్సి ఉంది. ఈ పదవులకు సమర్థులైన నాయకులను ఎంపిక చేయాల్సిన బాధ్యత సందీప్‌దేనని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల గడువు మాత్రమే ఉన్నందున పార్టీ కార్యక్రమాలతో ఊపు తెచ్చి నేతలను పరుగులు పెట్టిస్తేనే క్షేత్రస్థాయి కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుందని నేతలు చెబుతున్నారు.
గుజరాత్, మహారాష్ట్రలకు ఇన్‌ఛార్జిగా పనిచేసిన అనుభవం
తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జిగా సీఎం రేవంత్ రెడ్డితో సైతం సందీప్ మంచి కో-ఆర్డినేషన్‌తో పని చేయాల్సి ఉంటుంది. సందీప్ గతంలో ప్రత్యక్షంగా ఎక్కడా ఎంపీ, ఎమ్మెల్యేగా నేరుగా పోటీ చేసి గెలవలేదు. కానీ గుజరాత్, మహారాష్ట్రలకు ఇంఛార్జిగా పని చేసిన అనుభవాలు ఉన్నందున ఇక్కడి నేతలను సమన్వయపరుస్తూ గట్టిగా పనిచేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులను సిద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు, స్థానిక నేతల మధ్య అభిప్రాయ విభేదాలతో తరచూ వార్తల్లో ఉంటున్నారు. ఇటీవల సంగారెడ్డి డీసీసీ పదవి భర్తీపై మంత్రి, ఎమ్మెల్యే వివాదం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి చికాకులను చక్కదిద్ది కలిసి పని చేసేలా బీఎం సందీప్ చూడాల్సి ఉంది.






