30 వేల మందికి ఒకటే మరుగుదొడ్డి
బయటికెళితే ఉగ్గబట్టాల్సిందే
టీమీడియా , నవంబర్ 18, హైదరాబాద్ బ్యూరో : పనిమీద బయటకు వెళ్లినా, కుటుంబ సమేతంగా ప్రయాణించినా మరుగుదొడ్ల కోసం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అదే మహానగరాల్లో అయితే ఎటు చూసినా జనం ఉండటంతో మూత్ర విసర్జనకు మరింత ఇబ్బందిగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కోటి 34 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్లో 440 ప్రజా మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. అంటే సగటున 30,000 మందికి ఒక శౌచాలయం ఉంది.
వేల కోట్ల రూపాయలతో రాజధాని ప్రాంతంలోని మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, అధ్వానంగా మారుతున్న మరుగుదొడ్ల వ్యవస్థను పట్టించుకోవడం లేదు. రోజూ ప్రయాణించే పాదచారులు, వాహనదారులకు ఉగ్గబట్టుకోవడమే దిక్కవుతోంది. ముఖ్యంగా మూత్రవిసర్జన సౌకర్యాలు లేవనే భయంతో చాలా మంది మహిళలు పనివేళల్లో నీళ్లు తాగడం మానేశారు. ఈ నెల 19న ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా నగరంలోని పరిస్థితిపై ప్రత్యేక కథనం.
రూ.100 కోట్లు ఖర్చు - ఫలితం శూన్యం
పాత జీహెచ్‌ఎంసీ పరిధిలో 2022, 2023 సంవత్సరాలలో 2,300 ప్రజా మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. దాని కోసం జీహెచ్‌ఎంసీ ఆ సమయంలో రూ.64 కోట్లు ఖర్చు చేసింది. ఒక సంవత్సరం తర్వాత వాటి నిర్వహణ కోసం టెండర్ పిలిచారు. ఆ రూపంలో మరో రూ.40 కోట్లు ఖర్చుచేశారు. మొత్తం మీద రూ.100 కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చు చేశారు. అయినా ఫలితం మాత్రం శూన్యం.
జీహెచ్‌ఎంసీ పునర్విభజనకు ముందు వాడుకలో లేని మరుగుదొడ్లను తొలగించమని అప్పటి కమిషనర్ జోనల్ అధికారులను ఆదేశించారు. దీంతో పారిశుధ్య విభాగం చర్యలు తీసుకుంది. మరుగుదొడ్ల సంఖ్య 2,300 నుంచి 800 కి తగ్గింది. అయితే అధికారులు వాటిని కూడా పట్టించుకోకపోవడంతో పునర్విభజన అనంతరం నిర్వహించిన సర్వేలో కేవలం 440 మరుగుదొడ్లు మాత్రమే వాడుకలో ఉన్నాయని తెలిసింది. అంటే నాలుగేళ్లలో 1,860 మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి.
సంస్థలతో కుమ్మక్కై నాసిరకం నిర్మాణాలు
స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో మంచి ర్యాంకు సాధించడం కోసం అప్పటి జోనల్ కమిషనర్లందరూ తమకు నచ్చిన సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని రకరకాల డిజైన్లతో మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. వారు ఫుట్‌పాత్‌లు, పార్కులు, ఖాళీ స్థలాల్లో సౌచాలయాలను ఏర్పాటు చేసి చేతులు దులుపేసుకున్నారు. కొందరు అధికారులు మరుగుదొడ్ల తయారీ కంపెనీలతో కుమ్మక్కై, నాసిరకమైన నిర్మాణాలు, ప్రజోపయోగం లేని పద్ధతులతో పనులు చేపట్టడంతో ఈ ప్రాజెక్టు విఫలమైంది.
రద్దీగా ప్రాంతాల్లోనూ
బేగంబజార్, చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, సీబీఎస్, కోఠి, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ వంటి రద్దీ ప్రాంతాల్లోనూ ప్రయాణికులు, పర్యాటకులు టాయిలెట్ల సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒప్పందం ప్రకారం యాడ్ ఏజెన్సీలు ప్రతి ఏసీ బస్ స్టాపులో సౌచాలయాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఎక్కడా ఒక్కచోట కూడా అందుబాటులో లేవు. జనార్దన్ రెడ్డి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్న సమయంలో నగరవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకులు, హోటళ్లలోని టాయిలెట్లను పాదచారులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆయన తర్వాత ఏ కమిషనర్ కూడా ఈ సమస్యపై దృష్టి పెట్టలేదు.






