Hyderabad

Families attending funerals are the targets... A 70-year-old man’s string of thefts!

Families attending funerals are the targets... A 70-year-old man’s string of thefts!

By ·

Share this article
Families attending funerals are the targets...  A 70-year-old man’s string of thefts!

 

 

అంత్యక్రియలకు వెళ్లిన కుటుంబాలే టార్గెట్..                                                         

70 ఏళ్ల వృద్ధుడి వరుస చోరీలు!


టీ మీడియా,నవంబర్13,హైదరాబాద్  బ్యూరో :  ఇంట్లో చావు జరిగిందని తెలిస్తే చాలు.. ఆ ఇంటిపై కన్నేసేవాడు. కుటుంబ సభ్యులంతా అంత్యక్రియలకు వెళ్లి ఇంటికి తాళం వేయగానే తన చేతివాటం ప్రదర్శించేవాడు. ఇలా విషాదంలో ఉన్న కుటుంబాల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 70 ఏళ్ల వృద్ధుడిని జడ్చర్ల పోలీసులు అరెస్ట్ చేశారు.

నాగసాల ప్రాంతానికి చెందిన బోయ కృష్ణయ్య (70) అలవాటుగా దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కాడు. జడ్చర్ల పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎక్కడైనా మరణం సంభవించిందని తెలిస్తే.. ఆ ఇంట్లోని పరిస్థితులను గమనించేవాడు. కుటుంబ సభ్యులంతా అంత్యక్రియలకు వెళ్లి ఇంటికి తాళం వేసిన తర్వాత అదును చూసుకుని లోపలికి ప్రవేశించేవాడు. బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను దొంగిలించి అక్కడి నుంచి ఉడాయించేవాడు.

ఫిబ్రవరిలో జరిగిన చోరీతో వెలుగులోకి..
ఈ ఏడాది ఫిబ్రవరిలో జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లి గ్రామంలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా పాత నేరస్థుడైన బోయ కృష్ణయ్యపై అనుమానం రావడంతో అతడిపై నిఘా పెట్టారు. చివరకు జడ్చర్ల పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నారు.

62 గ్రాముల బంగారం, 110 తులాల వెండి స్వాధీనం
ఎస్ఐ మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసుల విచారణలో కృష్ణయ్య తన దొంగతనాల గురించి అంగీకరించాడు. అతడి వద్ద నుంచి 62 గ్రాముల బంగారం, 110 తులాల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జడ్చర్లతో పాటు మిడ్జిల్, భూత్పూర్, తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ అతడిపై చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.

అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో అతడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. అంత్యక్రియలకు వెళ్లిన కుటుంబాల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఈ అలవాటు నేరస్థుడి వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Tags: