ఇక ఇల్లు కట్టుకోవడం ఈజీ..
తెలంగాణలో మారనున్న బిల్డింగ్ రూల్స్!
టీమీడియా , నవంబర్ 18, హైదరాబాద్ బ్యూరో : సొంతింటి కల నెరవేర్చుకోవాలంటే ముందుగా స్థలం కొనాలి.. ఆ తర్వాత ఇంటి నిర్మాణానికి అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాలి. ప్లాట్ చిన్నదైతే నిర్మాణానికి మరిన్ని పరిమితులు ఎదురవుతాయి. పార్కింగ్ కోసం స్థలం వదలాలి.. భవనం చుట్టూ ఖాళీ స్థలం ఉండాలి.. ఇలా ఎన్నో నిబంధనలు ఇంటి నిర్మాణాన్ని భారంగా మారుస్తున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న బిల్డింగ్ రూల్స్ స్థానంలో కొత్త నియమావళిని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఈ మార్పుల వల్ల ప్రధానంగా చిన్న ప్లాట్లు ఉన్నవారికి ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతం 75 గజాల వరకు ఉన్న స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతుల నుంచి మినహాయింపు ఉంది. ఈ పరిమితిని 100 గజాలకు పెంచాలనేది ప్రభుత్వ ఆలోచన. అదే జరిగితే చిన్న స్థలాల్లో ఇళ్లు కట్టుకునేవారు అనుమతుల కోసం ఎక్కువ సమయం వెచ్చించాల్సిన అవసరం ఉండదు. నిర్మాణ ప్రక్రియ కూడా సులభతరం అవుతుంది.
ఇక స్థలం తక్కువగా ఉందని నిర్మాణ విస్తీర్ణాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితికి కూడా మార్పులు తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం సెట్‌బ్యాక్ నిబంధనలను సవరించే ప్రతిపాదన సిద్ధమవుతోంది. ప్రస్తుతం భవనం చుట్టూ ఎంత ఖాళీ స్థలం వదలాలనేది రోడ్డు వెడల్పు, ప్లాట్ విస్తీర్ణం, భవనం ఎత్తును బట్టి నిర్ణయిస్తున్నారు. ఈ దూరాలను గరిష్ఠంగా 20 శాతం వరకు తగ్గించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. దీనివల్ల అదే ప్లాట్‌లో మరికొంత నిర్మాణం చేపట్టేందుకు వీలవుతుంది. ఇల్లు కట్టుకునే వారికి అదనపు స్థలం అందుబాటులోకి రావడంతో పాటు నిర్మాణదారులకూ ప్రయోజనం కలుగుతుంది.
నగరాల్లో మరో ప్రధాన సమస్య పార్కింగ్. అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవనాలు పెరుగుతున్నా వాటికి సరిపడా పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో వాహనాలు రోడ్లపైనే నిలుపుతున్నారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని సెల్లార్ నిర్మాణానికి సంబంధించిన అర్హతలను మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం 900 గజాల స్థలం ఉంటేనే సెల్లార్ నిర్మాణానికి అనుమతి లభిస్తోంది. ఈ పరిమితిని 600 గజాలకు తగ్గించాలనే ప్రతిపాదన ఉంది. దీంతో అంతకంటే తక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో నిర్మించే భవనాలకూ పార్కింగ్ కోసం సెల్లార్ ఏర్పాటు చేసుకునే అవకాశం లభించనుంది.
పార్కింగ్ విషయంలో మరో కీలక మార్పు కూడా పరిశీలనలో ఉంది. 750 నుంచి 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు ప్రస్తుతం ఒక సెల్లార్ మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ సంఖ్యను రెండుకు పెంచాలని అధికారులు భావిస్తున్నారు. ఇది కార్యరూపం దాలిస్తే భవనాల కింద మరింత పార్కింగ్ స్థలం అందుబాటులోకి వస్తుంది. ఫలితంగా రోడ్లపై వాహనాలను నిలిపే పరిస్థితి కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.
బిల్డర్లకు సంబంధించిన కొన్ని నిబంధనలపైనా ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. ముఖ్యంగా మార్టిగేజ్ విధానం వారికి భారంగా మారుతోందనే అభిప్రాయాలున్నాయి. నిర్మాణ అనుమతి తీసుకునే సమయంలో భవనంలోని కొంత భాగాన్ని తాకట్టు పెట్టాల్సి వస్తోంది. దీంతో ప్రాజెక్టు పూర్తయినా ఆస్తిని విక్రయించడంలో కొన్ని పరిమితులు ఎదురవుతున్నాయని బిల్డర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్దిష్ట పరిమాణంలోపు నిర్మాణాలకు ఈ నిబంధనను పూర్తిగా తొలగించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
వాస్తవానికి ప్రస్తుతం అమల్లో ఉన్న భవన నిర్మాణ నిబంధనలు 2012లో రూపొందించినవే. అప్పటి నుంచి అవసరాలకు అనుగుణంగా అనేక మార్పులు చేసినా అవి సమగ్రంగా లేవనే భావనతో ప్రభుత్వం ఇప్పుడు కొత్త విధానంపై దృష్టి పెట్టింది. ఇప్పటివరకు ఈ నిబంధనల్లో 62 సార్లు సవరణలు జరిగాయి. ఈ విడివిడి మార్పులన్నింటినీ సమీక్షించి ఒకే సమగ్ర నియమావళిని రూపొందించేందుకు మున్సిపల్ శాఖ అధికారులు ముసాయిదా సిద్ధం చేస్తున్నారు.
కొత్త నిబంధనలు ఖరారైతే ఇంటి నిర్మాణానికి అనుమతుల ప్రక్రియలో మార్పులు రావడంతో పాటు ప్లాట్ల వినియోగం, పార్కింగ్ సౌకర్యాలు, బిల్డర్లకు సంబంధించిన నిబంధనల్లోనూ వెసులుబాటు లభించనుంది. అయితే ప్రభుత్వం పరిశీలిస్తున్న అంశాలు ఇంకా ప్రతిపాదనలకే పరిమితం. తుది నిర్ణయం తీసుకుని అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన తర్వాతే వీటి అమలుపై స్పష్టత వస్తుంది.






