పల్లెపాలెం తీరంలో భారీ అగ్నిప్రమాదం - మత్స్యకారుల వలలు దగ్ధం
రూ.2 కోట్లకు పైగా నష్టం
టీమీడియా , నవంబర్ 18, ప్రకాశం : ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి వేళ ఎగసిపడిన మంటలు మత్స్యకారుల పొట్టకొట్టాయి. కొత్తపట్నం మండలం పల్లెపాలెం సముద్ర తీరంలో మంగళవారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మత్స్యకారులకు చెందిన చేపల వలలకు అకస్మాత్తుగా మంటలు అంటుకుని, పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. వలలన్నీ ఒకే చోట గుట్టలుగా పోసి ఉండటంతో మంటలు చాలా వేగంగా వ్యాపించాయి.
మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో కాలిపోయిన వలల విలువ దాదాపు రూ.2 కోట్లకు పైగానే ఉంటుందని మత్స్యకారులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఎమ్మెల్యే, ఎస్పీ పరిశీలన అగ్నిప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాలిపోయిన వలలను, ప్రమాద స్థలాన్ని వారు క్షుణ్ణంగా పరిశీలించారు. వలలకు మంటలు అంటుకున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై స్థానికులను ఆరా తీశారు.
అయితే, ఈ ప్రమాదంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వలలకు దానంతట అవే మంటలు ఎలా అంటుకున్నాయనే దానిపై మత్స్యకారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టి ఉంటారని ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలిలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి వాస్తవాలను వెలికితీస్తామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పష్టం చేశారు.






