andrapredesh

Cyclones battering the state Three disasters within a span of one month—as seen in 1976 and 1987

Cyclones battering the state Three disasters within a span of one month—as seen in 1976 and 1987

By ·

Share this article
Cyclones battering the state  Three disasters within a span of one month—as seen in 1976 and 1987

 

 

 

రాష్ట్రంపై విరుచుకుపడుతున్న తుపాన్లు                                                                           

1976, 1987లోనూ నెల వ్యవధిలో 3 విపత్తులు
 
 
 
టీమీడియా , నవంబర్ 18, అమరావతి :సూపర్‌ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు వర్షాలు అంతంతమాత్రమే కురిశాయి. దీంతో ఖరీఫ్‌ సీజన్‌ను కరవు కమ్మేసింది. వర్షాభావంతో పంటల సాగు తగ్గిపోగా, భూగర్భ జలాలు అడుగంటి తాగునీటికీ ఎద్దడి వస్తుందని అధికారులు తెలిపారు. ఈ తరుణంలో 20 రోజుల వ్యవధిలో 3 భారీ తుపాన్లు రావడంపై వాతావరణ నిపుణులు లోతుగా విశ్లేషిస్తున్నారు. అక్టోబరు 26-29 మధ్య అర్నబ్‌ తుపాను బాపట్ల నుంచి శ్రీకాకుళం వరకు కుండపోత వర్షాలతో ముంచేసింది.

యానాం సమీపంలో తీరం దాటిన తుపానుతో రూ.4,563 కోట్ల మేర నష్టం జరిగిందని ప్రభుత్వ అంచనా. 16 జిల్లాల్లో 3.56 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిని రూ.1,260 కోట్ల మేర నష్టం జరిగింది. ఇక, నవంబరు 3-7 వరకు వణికించిన మురసు తుపాను 17 జిల్లాల్లో ప్రభావం చూపి రూ.2,484 కోట్ల నష్టం చేసింది. 1.45 లక్షల హెక్టార్లలో పంటలు పాడై రూ.1,200 కోట్ల మేర నష్టం వాటిల్లింది. తాజాగా రాష్ట్రం వైపు దూసుకొస్తున్న అక్వాన్‌ తుపాను 19 నాటికి తీరాన్ని తాకొచ్చని అధికారులు చెబుతున్నారు. గతంలోనూ ఇలా ఒకే సంవత్సరంలో నెల వ్యవధిలోనే 3 తుపాన్లు సంభవించిన సందర్భాలను శాస్త్రవేత్తలు గుర్తు చేసుకుంటున్నారు.

1976, 1987లో 3 సార్లు ముప్పు                                                                                                                  1976లో ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రం తీవ్ర కరువును ఎదుర్కొంది. చివరకు నవంబరులో 3 తుపాన్లు వణికించాయి. ధవళేశ్వరం ఆనకట్టకు గండి పడి పంటలు దెబ్బతిన్నట్లు 1977-78 ఆర్థిక సర్వేలో ప్రభుత్వం వెల్లడించింది. నవంబరు 4న మచిలీపట్నం సమీపంలో తీరం దాటిన తుపాను వల్ల గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి. నవంబరు 16న మరో తుపాను కావలి వద్ద తీరం దాటింది. మూడో తుపాను సముద్రంలోనే బలహీనపడి నెల్లూరు సమీపంలో వాయుగుండంగా తీరం దాటింది. ఈ తుపాన్ల కారణంగా ఎఫ్‌సీఐ గోదాముల్లోకి నీరు చేరి, ధాన్యం తడిచింది. కోత దశలోని వరి తుడిచిపెట్టుకుపోయింది.

1987 అక్టోబరు 15 నుంచి నవంబరు 13 మధ్య తుపాన్లు రాష్ట్రాన్ని ముంచేశాయి. అక్టోబరు 16న ఒంగోలులో తీరం దాటిన తుపాను ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీవర్షానికి కారణమైంది. నవంబరు 2న నెల్లూరు సమీపంలో తీరం దాటిన మరో తుపాను 10 జిల్లాల్లో 32.04 లక్షల మందిపై ప్రభావం చూపగా 119 మంది చనిపోయారు. 1.1లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయి. అప్పట్లోనే రూ.126 కోట్ల నష్టం జరిగింది. నవంబరు 13న మచిలీపట్నం వద్ద తీరం దాటిన తుపాను తీరం మొత్తాన్ని వణికించింది.

వణికించిన నవంబరు విపత్తులు 
2020 నవంబరులో పుదుచ్చేరి సమీపంలో తీరందాటిన నివర్‌ తుపాను ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పంటలను దెబ్బతీసింది.
2013 నవంబరు 22న మచిలీపట్నం సమీపంలో తీరం దాటిన హెలెన్‌ తుపాను 10 జిల్లాల్లో 7.13 లక్షల మందిపై ప్రభావం చూపింది. 9 మంది మరణించగా 7,499 ఇళ్లు దెబ్బతిన్నాయి. రూ.620కోట్ల నష్టం వాటిల్లింది. అదే నెలలో 'లెహర్‌' ఇక్కడే తీరం దాటింది.
2010 నవంబరు 7న ఉత్తర తమిళనాడులో తీరం దాటిన 'జల్‌' కారణంగా 13 జిల్లాల్లో 63 మంది చనిపోయారు. 16.98 లక్షల మంది ప్రభావితులయ్యారు. రూ.2,496 కోట్ల నష్టం జరిగింది.
2008 నవంబరు 16న కావలి సమీపంలో తీరం దాటిన ఖైముఖ్‌ తుపాను 9 జిల్లాల్లో లక్ష మందిపై ప్రభావం చూపింది.
1996 నవంబరు 6న కాకినాడ సమీపంలో తీరం దాటిన తుపాను, పెనుగాలుల ధాటికి 4 జిల్లాల్లో 80.62 లక్షల మంది ప్రభావితమయ్యారు. 1,077 మంది చనిపోగా 6.16 లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయి. రూ.6,129 కోట్ల నష్టం జరిగింది.
1977 నవంబరులో తుపాను కోస్తాలోని 8 జిల్లాల్ని వణికించింది. దీన్ని 'దివిసీమ ఉప్పెన'గా చెబుతారు. గ్రామాలకు గ్రామాలు తుడిచిపెట్టుకు పోవడంతో 10 వేల మంది చనిపోయారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నా 20 వేల మంది చనిపోయినట్లు అంచనా. లక్షల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి. ఇళ్లు నేలమట్టమయ్యాయి.
బంగాళాఖాతంలో పెరిగిన ఉష్ణోగ్రతలు : బంగాళాఖాతంలో 300-500 కి.మీ. మేర ఉండే ఇంటర్‌ ట్రాఫికల్‌ కన్వర్జన్స్‌ జోన్‌ (ఐసీటీజడ్‌)లో సాధారణంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని దక్షిణ, ఉత్తర దిశల నుంచి వీచే తేమగాలులు ఇక్కడ కలుస్తాయని ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణం, సముద్రశాస్త్ర విభాగాధిపతి ఆచార్య సీవీ నాయుడు తెలిపారు. కాలానుగుణంగా ఐసీటీజడ్‌ మారుతూ శీతాకాలంలో దక్షిణ బంగాళాఖాతం వైపునకు వస్తుందని ఇక్కడ అర డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగినా తీవ్ర వాయుగుండానికి కారణమవుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం అక్కడ 29 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా మరోపక్క ఈశాన్య రుతుపవనాలు సముద్రం నుంచి తేమను గ్రహించడంతో అల్పపీడనాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారి వాయుగుండంగా బలపడి తుపాన్లకు కారణమవుతున్నాయని అన్నారు. అక్వాన్‌ తుపాన్‌ కూడా అలా బలపడిందేనని ఈ నెలాఖరులో మరో తుపాను కూడా సంభవించవచ్చని సీవీ నాయుడు తెలిపారు.

Tags: