hyderabad

Lands at Fox Sagar, worth crores of rupees, have been alienated HYDRAA steps in for restoration

Lands at Fox Sagar, worth crores of rupees, have been alienated HYDRAA steps in for restoration

By ·

Share this article
Lands at Fox Sagar, worth crores of rupees, have been alienated  HYDRAA steps in for restoration

 

 

రూ.కోట్ల విలువైన ఫాక్స్​సాగర్ భూములు అన్యాక్రాంతం                                            

 పునరుద్ధరణకు రంగంలోకి దిగిన హైడ్రా
 
 
టీ మీడియా,నవంబర్11,  హైదరాబాద్ బ్యూరో : వేలాది మంది ప్రజలకు తాగు నీటిని అందించే జీడిమెట్ల చెరువు (ఫాక్స్‌ సాగర్‌) మరో హుస్సేన్‌ సాగర్‌గా మారింది. భూ కబ్జా రాయుళ్లతో అవినీతి అధికారులు కలిసి చెరువు ఎఫ్‌టీఎల్‌ (ఫుల్​ ట్యాంక్ లెవల్) పరిధిలోనే నిర్మాణాలు చేపట్టారు. 2014 తర్వాత కూడా రూ.కోట్ల విలువ చేసే చెరువు స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయి. ప్రస్తుతం ఫాక్స్​ చెరువును పునరుద్ధరించేందుకు హైడ్రా రంగంలోకి దిగింది. ఆక్రమణలను తొలగించడమే ప్రధాన సవాల్‌గా మారింది.

1897 నాటి చెరువు
మేడ్చల్​-మల్కాజిగిరి పరిధిలోకి వచ్చే జీడిమెట్ల చెరువును 1897లో నాటి నిజాం పాలకులు నిర్మించారు. అప్పటి బ్రిటీష్‌ అధికారి కొలినల్‌ ఆర్‌.ఈ.ఫాక్స్‌ దీనిని ఆధునికీకరించిన తర్వాత దీనికి ఫాక్స్‌ సాగర్‌ అనే పేరు ఏర్పడింది. ఈ చెరువు దూలపల్లి, జీడిమెట్ల, కొంపల్లి గ్రామాల మధ్య విస్తరించి ఉంది. ఈ మూడు గ్రామాలకు చెందిన సుమారు 453 ఎకరాలు పట్టా భూములు ముంపులో ఉన్నాయి. వర్షాకాలం తర్వాత ముంపు తగ్గితే రైతులు పంటలు పండించేవారు. కాలక్రమంలో చెరువు బఫర్‌ జోన్‌ మొత్తం రియల్‌ ఎస్టేట్‌గా మారింది. అధికారికంగా 52.34 ఎకరాలు ఉండగా, వంద ఎకరాలకు పైగా వెంచర్లు, పలు గోదాములు వెలిశాయి.

రియల్ ​ఎస్టేట్​ వ్యాపారులకు అండగా
చెరువు భూములను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులే రియల్‌ ఎస్టేట్‌కు తమ పూర్తి సహకారం అందించారు. 2014 తర్వాత చెరువు నీటి మట్టాన్ని 38 అడుగుల నుంచి 20 అడుగులకు తగ్గించారు. దీంతో ముంపు ప్రాంతం తగ్గి ఆ ప్రాంతాల్లో పలు వెంచర్లు వేశారు. 2020లో భారీ వరదను దిగువకు విడుదల చేసేందుకు ఏకంగా గేట్లనే ధ్వంసం చేశారు. నీరు లేకపోవడంతో పట్టా పేరుతో ఇబ్బడి ముబ్బడిగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. వాస్తవానికి ఈ ప్రాంతం (ఎఫ్‌టీఎల్‌) 22ఏలో చేర్చాల్చి ఉన్నప్పటికీ ఆ పని జరగలేదు. కానీ ఎడాపెడా రిజిస్ట్రేషన్లు మాత్రం జరిగాయి.

చెరువు మధ్యలో కట్ట నిర్మాణం
2018లో చెరువు ఆధునికీకరణ పనుల పేరుతో రూ.44 కోట్లు మంజూరు చేశారు. కొంతమంది ప్రయోజనాల కోసం గత ప్రభుత్వంలో నీటి పారుదల శాఖ అధికారులే చెరువు మధ్యలో కట్టను నిర్మించారు. సరిహద్దులు ముందుకు జరిపి సిమెంట్​ రోడ్డు వేశారు. ఈ ప్రాంతంలోనే మాజీ మంత్రి 37 ఎకరాలు ఆక్రమించారని హైడ్రా గుర్తించింది. ఇటీవల సిమెంట్‌ రోడ్డును ధ్వంసం చేసింది. మరో న్యాయవాదికి చెందిన ఫామ్‌ హౌస్‌ను హైడ్రా తొలగించింది. సరిహద్దులు చెరిపేసిన అధికారులపై మాత్రం ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం.

వాటిపై సంయుక్త సర్వే
2014కు ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లబోమని హైడ్రా చెబుతోంది. 2014-2023 మధ్య కాలంలో చాలా నిర్మాణాలు వచ్చాయి. గోదాములు ఎక్కువగా నిర్మాణం చేశారు. ఇటీవల జరిపిన సర్వేలో దాదాపు 150 ఎకరాలకు పైగా ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఎఫ్‌టీఎల్‌ (ఫుల్​ ట్యాంక్ లెవల్) పరిధిలో జాయింట్‌ సర్వే చేయాలని నిర్ణయించి హైడ్రా ముందుకు కదిలింది. దీనిలో రెవెన్యూ అధికారుల ప్రమేయం లేకుండా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

చెరువు విస్తీర్ణం వివరాలు ఇలా
విస్తీర్ణం : 519 ఎకరాలు
బఫర్‌ జోన్‌ : 52.34 ఎకరాలు
ఎఫ్‌టీఎల్‌ పరిధి : 482.24 ఎకరాలు
ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ప్రభుత్వ భూమి : 16.30 ఎకరాలు
ఎఫ్‌టీఎల్‌ పరిధిలో పట్టా : 453 ఎకరాలు
చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఆక్రమణలు : దాదాపు 150 ఎకరాలకు పైగా!
రూ.189 కోట్లతో ఫాక్స్​సాగర్ ఆధునికీకరణ పనులు
జీడిమెట్లలోని ఫాక్స్‌సాగర్‌ చెరువును హైడ్రా రూ.189 కోట్లతో ఆధునికీకరించనున్నట్లుగా ప్రకటించింది. ఇందుకోసం ముందుగా సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించనుంది. దూలపల్లిలో పెద్దల ఆక్రమణలను తొలగిస్తారా? లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గుట్టుగా సంయుక్త సర్వే (జాయింట్ సర్వే) చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. 2014లో హెచ్‌ఎండీఏ, నీటి పారుదల శాఖ సంయుక్తంగా సర్వే చేసి 482.24 ఎకరాలుగా ఎఫ్‌టీఎల్‌ (ఫుల్ ట్యాంక్ లెవల్) నిర్ణయించింది. ప్రస్తుతం ఆ మేరకు రక్షించాలని హైడ్రాను స్థానికులు కోరుతున్నారు.

Tags: