hyderabad

A 'trivial' dispute claims a life - RTC conductor passes away after battling for his life

A 'trivial' dispute claims a life - RTC conductor passes away after battling for his life

By ·

Share this article
A 'trivial' dispute claims a life  - RTC conductor passes away after battling for his life

 

 

ప్రాణాలు బలిగొన్న 'చిల్లర' గొడవ                                                                                  

మృత్యువుతో పోరాడుతూ ఆర్టీసీ కండక్టర్ మృతి

 


 టీ మీడియా, నవంబరు 4, హైదరాబాద్ బ్యూరో : టికెట్‌ చిల్లర విషయంలో ఆర్టీసీ బస్సులో తలెత్తిన వివాదం మహిళా కండక్టర్‌ ప్రాణాలను బలిగొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపోనకు చెందిన కండక్టర్‌ గుండ్ల ప్రవళిక చికిత్స పొందుతూ మృతి చెందింది. చిల్లర విషయంలో కండక్టర్‌ ప్రవళికకు మరో మహిళా ప్రయాణికురాలితో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన మహిళా ప్రయాణికురాలు, కదులుతున్న బస్సులోంచి కండక్టర్‌ ప్రవళికను బయటకు నెట్టేసింది. అనూహ్యంగా కిందపడిపోయిన కండక్టర్ కాళ్లపై నుంచి బస్సు వెనక చక్రాలు వెళ్లడంతో రెండు కాళ్లు నలిగిపోయాయి.

పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రవళిక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా కండక్టర్‌ ప్రవళిక మృతి పట్ల ఆర్టీసీ కార్మికులు, యూనియన్ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని, ఆర్థిక సహాయంతో పాటు కుటుంబానికి అవసరమైన సహకారం అందించాలని యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సీఎం సంతాపం
కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ప్రవళిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్​లో ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.

రూ.10 లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటన
మణుగూరు డిపో ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్​గ్రేషియాను ప్రకటించింది. ఆమె తల్లికి ఉద్యోగంతో పాటు, ఇంటిని మంజూరు చేస్తామని తెలిపింది. ప్రవళిక మృతిపట్ల టీజీఎస్​ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె అకాల మరణం ఆర్టీసీకి తీరని లోటని తెలిపారు. ప్రవళిక కుటుంబానికి అండగా ఉంటామని నాగిరెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీతో ఆయన మాట్లాడారు. ప్రవళిక మృతికి నిరసనగా ఖమ్మం రీజియన్​ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు బంద్​కు పిలుపునిచ్చారు. బస్సులు నడవకపోవడంతో దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అసలేం జరిగిందంటే?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మిట్టగూడెంనకు చెందిన ఓ ప్రయాణికురాలు గత నెల 25న మణుగూరు నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న మణుగూరు ఆర్టీసీ డిపోనకు చెందిన పల్లె వెలుగు బస్సు ఎక్కారు. ఆమెతో పాటు ఉన్న బాలుడికి టికెట్​ తీసుకోవాలని మహిళా కండక్టర్ చెప్పారు. అయితే మొదట టికెట్ తీసుకునేందుకు ప్రయాణికురాలు నిరాకరించింది. కండక్టర్‌తో గొడవకు దిగింది. అనంతరం బాలుడికి టికెట్ తీసుకునేందుకు అంగీకరించింది. టికెట్ కోసం కండక్టర్​కు ప్రయాణికురాలు నగదు ఇచ్చారు.

చిల్లర విషయంలో పెరిగిన వివాదం
టికెట్ ఇచ్చిన మహిళా కండక్టర్ ప్రవళిక దిగేటప్పుడు మిగిలిన చిల్లర తీసుకోవాలని ప్రయాణికురాలికి సూచించారు. అయితే ఇప్పుడే చిల్లర ఇవ్వాలని ప్రయాణికురాలు పట్టుబట్టింది. దీంతో వారి మధ్య మరోసారి మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో మిట్టగూడెం స్టాప్ రావడంతో ఆమె బస్సు దిగేందుకు ప్రయత్నించగా, ప్రయాణికురాలిని అశ్వాపురం పోలీస్​ స్టేషన్‌కు తీసుకెళ్లాలని కండక్టర్ ప్రయత్నించారు. ఈ మేరకు బస్సును ముందుకు నడపాలని డ్రైవర్‌కు కండక్టర్ సూచించగా, బస్సు కదులుతున్న సమయంలో ప్రయాణికురాలు కండక్టర్​ను నెట్టివేసింది. దీంతో కండక్టర్ కదులుతున్న బస్సు వెనక చక్రాల కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆమె కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఆరోజు నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కండక్టర్​ ఆరోగ్య పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి మృతి చెందింది.

Tags: