చలికి వణుకుతున్న రాష్ట్రం
పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు
టీమీడియా , నవంబర్10 , హైదరాబాద్ బ్యూరో :మొన్నటి వరకు తుపానులను ఎదుర్కొన్న రాష్ట్రం, నేడు చలికి వణికిపోతోంది. శీతాకాలం ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా 15 డిగ్రీల వరకు చేరుతున్నాయి. వివరాల్లోకి వెళితే, రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ఇప్పటికే చలి గజగజా వణికిస్తోంది. రానున్న 3 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే 29 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది.
12 డిగ్రీలకు పడిపోయే అవకాశం
ఖమ్మం, జోగులాంబ గద్వాల, సూర్యాపేట, జనగామ జిల్లాలు మినహా ఇతర జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, నిర్మల్, వనపర్తి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల వరకు పడిపోవచ్చని వెల్లడించింది.
వాహన డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి
దీంతోపాటు తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు అనేక చోట్ల పొగ మంచు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే వాహనాల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దేశంలోని ఈశాన్యం నుంచి రాష్ట్రం వైపు వీస్తున్న అల్పపీడన గాలులే చలి పెరగడానికి కారణమని శాస్త్రవేత్తలు స్పష్టం చేన్నారు.
ఆదిలాబాద్‌లో 14.7 డిగ్రీలు
ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రత 14.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 14.7 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. కామారెడ్డి, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో 14.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 18 జిల్లాల్లో 15.1 నుంచి 19.5 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 16.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.






