ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు
ప్రభుత్వం భారీ ఏర్పాట్లు
ఈ నెల 20 వరకు రిజిస్ట్రేషన్లు
టీ మీడియా,నవంబర్11, హైదరాబాద్ బ్యూరో : పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరగనున్న సమ్మిట్‌లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. 4 ప్రత్యేక హాళ్లలో 52 రంగాలకు చెందిన సమావేశాలు, ప్రదర్శనలు జరిగేలా ప్రణాళిక చేశారు. సమ్మిట్‌లో తొమ్మిది ప్రధాన ఎక్స్‌పోలు, కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
రిజిస్ట్రేషన్లు ప్రారంభం
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వ్యాపార ప్రతినిధులు, స్టార్టప్ సంస్థలు, పారిశ్రామిక రంగ నిపుణులు ప్రత్యేక సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రభుత్వం వెల్లడించింది. గతేడాది గ్లోబల్ సమ్మిట్‌తో పోలిస్తే ఈసారి ప్రదర్శన ప్రాంగణాన్ని భారీగా విస్తరిస్తున్నారు. ఫ్రమ్ ప్లెడ్జ్ టు ప్రొడక్ట్ నినాదంతో సదస్సు కార్యక్రమాలను రూపొందించారు. పెట్టుబడి హామీ, భూమి కేటాయింపు, పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పన, ఉత్పత్తి ఇలా 5 దశల్లో పెట్టుబడి ప్రయాణాన్ని వివరించనున్నారు.
ప్రారంభ ప్లీనరీతో పాటు 4 ప్రత్యేక హాళ్లలో 52 రంగాల వారీగా సమావేశాలు జరగనున్నాయి. ఇంజిన్స్ ఆఫ్ తెలంగాణ, ది వైడర్ ఎకానమీ, ది తెలంగాణ స్టాక్, ది సోషల్ సెక్టార్ ఫోరం పేర్లతో ఈ హాళ్లను ఏర్పాటు చేస్తారు. పారిశ్రామికవేత్తలు, మంత్రుల మధ్య ప్రత్యక్ష చర్చలకు సీఈవో-మంత్రి డీల్ ఫ్లోర్, ప్రభుత్వ-వ్యాపార సంస్థల సమన్వయానికి ప్రత్యేక డెస్క్ అందుబాటులో ఉంటుంది.
ముగింపు రోజున సదస్సులో ప్రకటించిన పెట్టుబడి హామీలు ఏ మేరకు కార్యరూపం దాల్చాయో వివరించేందుకు ప్లెడ్జ్ టు ప్రొడక్ట్ స్కోర్‌కార్డ్ విడుదల చేయనున్నారు. ఆసక్తి ఉన్న స్టార్టప్‌లు, ఆవిష్కర్తలు ఈ నెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఎంపికైన ఆవిష్కరణలను సమ్మిట్‌లో ప్రదర్శిస్తారు.
రక్షణ రంగానికి పెద్దపీట
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో తొమ్మిది ప్రధాన ఎక్స్‌పోలు, కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రక్షణ రంగానికి పెద్దపీట వేయనున్నారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు వ్యాపార ప్రదర్శనలు నిర్వహించి, 10 నుంచి 13 వరకు ప్రజల సందర్శనకు అవకాశం కల్పిస్తారు. సదస్సు ప్రారంభం రోజు ప్రత్యేక ఏరోబాటిక్ ఎయిర్ షో నిర్వహించనున్నారు. రక్షణ, అంతరిక్షం, ఏరోస్పేస్ రంగాల నుంచి 35, ఆరోగ్య, బయో టెక్నాలజీ, ఔషధ రంగాల నుంచి 30 స్టార్టప్‌లు పాల్గొంటాయి. వ్యవసాయం, ఇంధనం, వైద్యం, విద్య, ప్రజా మౌలిక సదుపాయాల రంగాల్లో వినూత్న ఆలోచనలను ఆహ్వానిస్తున్నారు.
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ రంగాలకు చెందిన ఇండియాజాయ్-2026 కార్యక్రమాన్ని డిసెంబర్ 7 నుంచి 13 వరకు నిర్వహిస్తారు. 300 మంది కూర్చునేలా ఈ-స్పోర్ట్స్ అరేనా ఏర్పాటు చేస్తారు. క్రియేటర్స్ కార్నర్‌ను కామిక్ కాన్‌తో కలిసి నిర్వహించనున్నారు. ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ ఎక్స్‌పోలో 60 కంపెనీలు తమ ఉత్పత్తులు, సాంకేతికతను ప్రదర్శించనున్నాయి. తెలంగాణ పెవిలియన్‌లో ఇఖత్, బతుకమ్మ థీమ్‌తో అలంకరణ, ప్రత్యక్ష చేనేత ప్రదర్శన, 360 డిగ్రీల ప్రొజెక్షన్ హాలు, కాకతీయ శిల్పకళ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
మహిళా పారిశ్రామిక వేత్తల కోసం శక్తి పెవిలియన్
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల నుంచి భారీ పరిశ్రమల వరకు సంస్థలు పాల్గొనేలా ఇండస్ట్రియల్ ఎక్స్‌పో నిర్వహిస్తారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం శక్తి పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నారు. ఫార్మ్ టు ఫోర్క్-తెలంగాణ పేరుతో వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రదర్శన ఉంటుంది. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్రాన్ని సిద్ధం చేయడంపై శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు, రైతులు, నిపుణులు చర్చిస్తారు. సుమారు 200 మంది పాల్గొనే ఈ కార్యక్రమంలో ఐదు అంశాలపై సమావేశాలు ఉంటాయి.
రానున్న పదేళ్ల కోసం వాతావరణ స్థిరత్వ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తారు. డిసెంబర్ 8న 5 వేల చదరపు మీటర్లలో ఎడ్యుకేషన్, రీసెర్చ్, స్కిల్లింగ్ ఎక్స్‌పో నిర్వహిస్తారు. ఐఐటీ హైదరాబాద్, ఐఎస్‌బీ, బిట్స్, నల్సార్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో పాటు యూకే, యూరప్ పెవిలియన్లలో మొత్తం 47 సంస్థలు ఇందులో పాల్గొంటాయి.
25 మందితో అడ్వైజరీ కౌన్సిల్
గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ కోసం సుమారు 25 రంగాలకు చెందిన దాదాపు 200 మంది ప్రముఖులతో అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నారు. మంత్రుల అధ్యక్షతన రంగాల వారీగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లను కూడా ఏర్పాటు చేస్తారు. వైద్య, వస్త్ర పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, యానిమేషన్, గేమింగ్ తదితర రంగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఈసారి గతేడాదికి మించిన పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.



