hyderabad

A New Boss for Hyderabad The Journey of Mahesh Bhagwat, a Familiar Face to the City

A New Boss for Hyderabad The Journey of Mahesh Bhagwat, a Familiar Face to the City

By ·

Share this article
A New Boss for Hyderabad  The Journey of Mahesh Bhagwat,   a Familiar Face to the City

 

 

హైదరాబాద్​కు కొత్త బాస్​                                                                         

నగరానికి సుపరిచితుడైన                                                                 

మహేశ్​ భగవత్​ ప్రస్థానం


 టీ మీడియా,నవంబర్13,హైదరాబాద్  బ్యూరో  : హైదరాబాద్‌ నగరానికి కొత్త కొత్వాల్​గా డాక్టర్ మహేశ్‌ మురళీధర్‌ భగవత్‌ నియమితులయ్యారు. నగర పోలీసింగ్‌పై మంచి అవగాహన, శాంతి భద్రతల పరిరక్షణలో సుదీర్ఘ అనుభవం, మానవ అక్రమ రవాణా నిరోధంలో అంతర్జాతీయ గుర్తింపు లాంటి ప్రత్యేకతలు కలిగిన 1995 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి ఇప్పుడు భాగ్యనగర పోలీస్‌ బాస్‌గా బాధ్యతలు చేపట్టారు. గతంలో హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసింగ్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన మహేశ్‌ భగవత్‌, ఇప్పుడు నగర పోలీస్‌ వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్నారు.

మహేశ్​ భగవత్ గతంలో నిర్వర్తించిన బాధ్యతలు
మహేశ్​ భగవత్​కు రాజధాని పోలీసింగ్‌పై విశేష అనుభవం ఉంది. గతంలో హైదరాబాద్‌ నగరంలోని వివిధ జోన్లలో డీసీపీగా పని చేశారు. సున్నితమైన సౌత్‌జోన్‌ బాధ్యతలు కూడా నిర్వహించారు. ఆదిలాబాద్‌, కడప, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఎస్పీగా పనిచేశారు. సైబరాబాద్‌లో డీసీపీగా, అంతర్గత భద్రత విభాగం ఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు.

2016లో ఏర్పాటైన రాచకొండ కమిషనరేట్‌కు తొలి పోలీస్‌ కమిషనర్‌గా నియమితులై సుమారు ఆరున్నరేళ్ల పాటు సేవలందించారు. 2022లో సీఐడీ అదనపు డీజీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఈఐఆర్‌ వ్యవస్థలో తెలంగాణను భాగస్వామ్యం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 2024 జులై 10 నుంచి రాష్ట్ర డీజీపీ లా అండ్‌ ఆర్డర్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అత్యంత కీలకమైన హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.

అక్రమ రవాణా నిరోధంలో కీలక పాత్ర
పోలీస్‌ అధికారిగా నేర నియంత్రణతో పాటు సామాజిక బాధ్యతలోనూ మహేశ్‌ భగవత్‌ తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా మానవ అక్రమ రవాణా నిరోధంలో ఆయన సేవలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. 2004 నుంచి 2022 మధ్య 2 వేలకు పైగా మహిళలు, చిన్నారులను అక్రమ రవాణా ముఠాల చెర నుంచి రక్షించారు. సుమారు 200 వ్యభిచార కేంద్రాలను మూసివేయించారు. ఇటుక బట్టీలు, ప్రమాదకర పరిశ్రమల్లో పని చేస్తున్న సుమారు 7 వేల మంది బాల, వెట్టి కార్మికులకు విముక్తి కల్పించడంలో కీలకంగా వ్యవహరించారు.

పలు అవార్డులు సొంతం
ఆదిలాబాద్‌లో నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన 'పోలీస్‌ మీకోసం' కార్యక్రమానికి 2004లో అమెరికా ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ చీఫ్స్‌ ఆఫ్‌ పోలీస్‌ నుంచి అవార్డు అందుకున్నారు. నల్గొండలో మానవ అక్రమ రవాణా బాధితుల రక్షణ, పునరావాసం కోసం చేపట్టిన 'ఆసరా' కార్యక్రమానికి 2006లో అంతర్జాతీయ అవార్డులు లభించాయి. 2017లో అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించిన 'ట్రాఫికింగ్‌ ఇన్‌ పర్సన్స్‌ రిపోర్ట్‌ హీరో' అవార్డును అందుకున్నారు. 2025లో డీవై పాటిల్‌ విద్యాపీఠ్‌ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. రాష్ట్రపతి గ్యాలంట్రీ పోలీస్‌ మెడల్‌, మెరిటోరియస్‌ సర్వీస్‌ మెడల్‌, విశిష్ఠ సేవా పతకం సహా పలు పురస్కారాలు ఆయన సేవలకు నిదర్శనం.

యువతకు ఆదర్శంగా
మరోవైపు సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్థులకు మార్గదర్శకుడిగానూ మహేశ్‌ భగవత్‌ ప్రత్యేక గుర్తింపు పొందారు. గత పదేళ్లలో ఆయన ఆధ్వర్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూ శిక్షణతో రెండు వేల మందికి పైగా ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్‌, ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపికయ్యారు. ఇషితా కిషోర్‌, దొనూరు అనన్య రెడ్డి, హర్షిత గోయల్‌ వంటి యూపీఎస్సీ టాపర్లకు కూడా మార్గదర్శకత్వం అందించారు.

మానవ అక్రమ రవాణా నిరోధంపై 8 పుస్తకాల రూపకల్పనలో భాగస్వాములయ్యారు. జాతీయ పోలీస్‌ అకాడమీతో పాటు వివిధ రాష్ట్రాల్లో పోలీస్‌ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఒకవైపు నేరాల నియంత్రణ, మరోవైపు సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసింగ్‌లో మార్పులు, అలాగే బాధితుల రక్షణ, యువతకు మార్గదర్శనం. ఇలా విభిన్న రంగాల్లో అనుభవం ఉన్న మహేశ్‌ భగవత్‌కు ఇప్పుడు హైదరాబాద్‌ నగర పోలీస్‌ పగ్గాలు అప్పగించారు.

Tags: