Telangana

Land Re-survey: Completed in 416 villages Process crosses a key milestone across 1,000 villages

Land Re-survey: Completed in 416 villages Process crosses a key milestone across 1,000 villages

By ·

Share this article
Land Re-survey: Completed in 416 villages  Process crosses a key milestone across 1,000 villages

 

 

భూ రీ సర్వే : 416 గ్రామాల్లో పూర్తి                                                                        

 1000 గ్రామాల్లో కీలక మైలురాయిని దాటిన ప్రక్రియ
 

 

టీ మీడియా,నవంబర్11,  హైదరాబాద్ బ్యూరో : భూముల హక్కులు, హద్దులు, విస్తీర్ణాలకు సంబంధించి తరతరాలుగా కొనసాగుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ రీసర్వే కీలక దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి గ్రామాల్లో సర్వే ప్రక్రియ కీలక మైలురాయిని దాటింది. ఇప్పటి వరకు 416 గ్రామాల్లో సర్వే పూర్తయింది. సుమారు 125 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో చేపట్టిన ఈ సమగ్ర భూ సర్వేను కేవలం ప్రభుత్వ రికార్డుల నవీకరణగా కాకుండా, ప్రతి భూ యజమానికి తన భూమిపై స్పష్టమైన హక్కులు, కచ్చితమైన సరిహద్దులు కల్పించే కార్యక్రమంగా ప్రభుత్వం భావిస్తోంది.

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా
రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ప్రజా ప్రభుత్వం సమగ్ర భూ రీసర్వే కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భవిష్యత్తులో కొత్త వివాదాలు తలెత్తకుండా చూడటమే రీ సర్వే ప్రధాన ఉద్దేశమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న భూ రీసర్వే పురోగతిపై సచివాలయంలో ఉన్నతాధికారులతో ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో సర్వే పరిస్థితులు, రైతుల స్పందన, సాంకేతిక సమస్యలు, సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలు ఉండగా, తొలి దశలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక్కో జిల్లాలో 70 గ్రామాల చొప్పున ఎంపిక చేయాలని నిర్ణయించినప్పటికీ నక్షాలు అందుబాటులో లేని గ్రామాలను కూడా చేర్చి మొత్తం 2,720 గ్రామాల్లో రీసర్వే కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెయ్యి గ్రామాల్లో సర్వే కీలక దశకు చేరుకోగా, ఇందులో 416 గ్రామాల్లో ప్రక్రియ పూర్తయిందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. భూముల విస్తీర్ణం, యాజమాన్య హక్కులు, సరిహద్దుల వివరాలను పరిశీలించిన తర్వాతే అధికారులు క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలన్నారు. చిన్న పొరపాటు కూడా భవిష్యత్తులో పెద్ద భూ వివాదానికి కారణం కాకూడదని స్పష్టం చేశారు.

అభ్యంతరాలను క్షుణ్నంగా పరిశీలించాలి
రీ సర్వేలో ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న మరో అంశం భూ యజమానుల అభిప్రాయాలు. సర్వే పూర్తయిన తర్వాత సంబంధిత భూ యజమానులకు తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. సర్వేలో నమోదైన వివరాలను పరిశీలించుకునేందుకు వారికి అవకాశం కల్పించాలన్నారు. భూ యజమానుల నుంచి వచ్చిన అభ్యంతరాలను క్షుణ్నంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించిన తర్వాతే తదుపరి ప్రక్రియను కొనసాగించాలని స్పష్టం చేశారు. సర్వే పూర్తయిందనే కారణంతో యజమానుల అభిప్రాయాలను పక్కన పెట్టకూడదని అన్నారు. సర్వే విధానం, నోటీసుల జారీ, అభ్యంతరాల నమోదు, వాటి పరిష్కారంపై గ్రామస్థాయిలో రైతులకు, భూ యజమానులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

భూదార్ కేటాయింపు ప్రక్రియ వేగవంతం చేయాలి
రీ సర్వే పూర్తైన గ్రామాల్లో భూదార్ కేటాయింపు ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఆధార్ నంబర్ తరహాలో ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపు కల్పించేలా భూదార్ నంబర్ కేటాయించనున్నారు. సుమారు 125 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేకు శ్రీకారం చుట్టామని మంత్రి పేర్కొన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న భూ వివాదాలకు ఈ రీ సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు.

భూ రీ సర్వే కేవలం ప్రభుత్వ రికార్డుల నవీకరణ కోసం చేపడుతున్న కార్యక్రమం కాదని, ప్రతి భూ యజమానికి తన భూమిపై స్పష్టమైన హక్కులు, కచ్చితమైన హద్దులు కల్పించడమే అసలైన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. భూ యజమానుల సంతృప్తినే సర్వే విజయానికి ప్రామాణికంగా తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Tags: