నీటి సమస్యా?
కొత్త బోరు వేయాలనుకుంటున్నారా?
అయితే పర్మిషన్ కంపల్సరీ
టీ మీడియా, నవంబరు 4, హైదరాబాద్ బ్యూరో :తెలంగాణ రాష్ట్రంపై ఎల్నినో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా క్యూర్ పరిధిలో (కోర్ అర్బన్ ఏరియా రీజియన్) అనుమతి లేకుండా కొత్త బోర్ల తవ్వకాలు చేపట్టరాదని ప్రభుత్వం పేర్కొంది. తాగునీటి అవసరాలు మినహా ఇతర అవసరాలకు శుద్ధి చేసిన మురుగు నీటిని వినియోగించడంతో పాటు భూగర్భ జలాల సంరక్షణకు సంబంధించి ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. 2027 జులై ఆఖరు వరకు అమల్లో ఉండే విధంగా జీవో 259 ద్వారా ఈ మార్గదర్శకాలను అమల్లోకి తెస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు ఉత్తర్వులను జారీ చేశారు. వాటి ప్రకారం,
ప్రభుత్వ మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయంటే?
గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టులు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య, పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ యూనిట్లు, బల్క్ వాటర్ సప్లయర్లు, ఇతరులు భూగర్భ జలాల వినియోగం నిబంధనలు-2023 మేరకు ఎన్‌వోసీ (నిరభ్యంతర పత్రం) తీసుకున్న తర్వాతనే బోర్లు వేయాల్సి ఉంటుంది.
అధికారుల నుంచి అన్ని అనుమతులు పొంది బోర్‌వెల్ తవ్వకం పూర్తయిన 15 రోజుల్లోగా రిగ్ ఆపరేటర్ నిర్ణీత అధికారికి వెల్ కంప్లీషన్ రిపోర్ట్ సమర్పించాలి. బోర్‌వెల్‌ను మండల తహసీల్దార్ వద్ద నమోదు చేయించాలి.
తోటల పెంపకం, నిర్మాణ ప్రాజెక్టులు, ల్యాండ్ స్కేపింగ్, రోడ్ల శుభ్రత లేదా ఇతర తాగు నీటి అవసరం లేని పనుల కోసం భూగర్భ జలాలను వినియోగించకూడదు. జలమండలి అందుబాటులోకి తెచ్చిన శుద్ధి చేసిన మురుగు నీటిని మాత్రమే వినియోగించాలి.
భూగర్భ జలాల అక్రమ వెలికితీత, వినియోగానికి సంబంధించి వాల్టా (వాటర్, ల్యాండ్, ట్రీస్) చట్టం ప్రకారం చర్యలు ఉంటాయి.
వాన నీటిని సంరక్షించడం, భూగర్భ జలాల రీఛార్జ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
ఏ శాఖ, ఏం చేయాలంటే..!
భూగర్భ జల శాఖ భూగర్భ జలాల ఒత్తిడి, కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి జల సంరక్షణ చర్యలను చేపట్టాలి.
పురపాలికలు భవన నిర్మాణ నిబంధనలకు అనుగుణంగా వాన నీటి సంరక్షణ చర్యలు, ఇంకుడు గుంతల నిర్మాణాలను తప్పనిసరిగా మున్సిపల్ కార్పొరేషన్లు అమలు చేయించాలి.
హైడ్రా చెరువులు, కుంటలు, వాటి నీటి రీఛార్జ్ ప్రాంతాల్లో ఆక్రమణలు, వ్యర్థాల డంపింగ్, కాలుష్యం నుంచి హైడ్రా పరిరక్షించాలి.
జలమండలి ప్రజలకు మంచి నీటిని సరఫరా చేసే పైప్‌లైన్ నెట్‌వర్క్‌లో లీకేజీలు, వృథాను అరికట్టడం, కంటింజెన్సీ మానిటరింగ్ కమిటీకి సమగ్ర నివేదికను ఎప్పటికప్పుడు సమర్పించడం వంటివి చేయాలి.






