ఢిల్లీ

I don’t really know Modi well. - Even when we cross paths, he doesn’t look me in the eye: Sonia

I don’t really know Modi well. - Even when we cross paths, he doesn’t look me in the eye: Sonia

By ·

Share this article
I don’t really know Modi well.                                                                                                        - Even when we cross paths, he doesn’t look me in the eye: Sonia

 

 

మోదీతో పెద్దగా పరిచయం లేదు                                                                                                        - ఎదురుపడినా నా కళ్లలోకి చూడరు: సోనియా
 

టీమీడియా , నవంబర్10 , ఢిల్లీ బ్యూరో :ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకు వ్యక్తిగతంగా పెద్దగా పరిచయం లేదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వెల్లడించారు. అధికారిక కార్యక్రమాల్లో ఎదురుపడినప్పుడు పలకరింపులు తప్ప ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ ఉండదని పేర్కొన్నారు. ఎదురెదురుగా వచ్చినప్పుడు మోదీ నమస్కారం చేసినా, కళ్లలోకి చూడకుండా పక్కకు చూస్తారని తెలిపారు. 'బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌' పేరుతో హార్పర్‌కాలిన్స్‌ ఇండియా ప్రచురించిన ఈ పుస్తకం మంగళవారం మార్కెట్‌లోకి వచ్చింది. ఆత్మకథ పుస్తకంలో మోదీ గురించి ప్రస్తావించారు.

పార్లమెంట్‌లో మోదీ భాషపై విమర్శలు
పార్లమెంట్‌లో ప్రసంగించే సమయంలోనూ మోదీ కొన్నిసార్లు బహిరంగ సభల్లో ఉపయోగించే కఠినమైన భాషనే వాడుతున్నారని సోనియా విమర్శించారు. ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించడంతో పాటు, తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూపై బీజేపీ వైఖరిని కూడా ఆమె ప్రస్తావించారు. 'కాంగ్రెస్‌ రహిత భారత్‌' అనే బీజేపీ నినాదం వెనక ఆ పార్టీ విధానాలు, సిద్ధాంతాలపై వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. ఈ వైఖరికి ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలమే కారణమని తాను భావిస్తున్నట్లు రాశారు. హిందూ సంప్రదాయంలో భిన్నమైన విశ్వాసాలు, ఆచారాలు, ఆలోచనలకు స్థానం ఉందని, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నుంచి అలాంటి విశాల దృక్పథాన్ని నేర్చుకున్నానని వివరించారు.

రాహుల్‌ ముందే వ్యక్తం చేసిన ఆందోళన
1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్యకు గురైన ఘటనను తన తాజా జ్ఞాపకాల పుస్తకం సోనియా గుర్తుచేసుకున్నారు. రాజీవ్‌ గాంధీతో కలిసి పర్యటనలో ఉన్న సమయంలో, ఆయన భద్రతపై రాహుల్‌ ఆందోళన వ్యక్తం చేశారని సోనియా రాశారు. భద్రతా ఏర్పాట్లలో మార్పులు చేయకపోతే తండ్రి అంత్యక్రియల కోసం తిరిగి రావాల్సి వస్తుందని రాహుల్‌ చెప్పినట్లు వివరించారు. ఆ మాటలు జరిగిన రెండు నెలలకే రాజీవ్‌ హత్యకు గురవడం తమ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచిందని పేర్కొన్నారు. రాజీవ్‌ మరణవార్తను ఓ స్నేహితుడు రాహుల్‌కు ఫోన్‌లో తెలియజేసినట్లు సోనియా గుర్తుచేసుకున్నారు. 'చెడు వార్త ఉంది' అని చెప్పగానే 'నాన్న చనిపోయారు కదా?' అని రాహుల్‌ వెంటనే అడిగినట్లు తెలిపారు. అనంతరం దిల్లీకి చేరుకున్న రాహుల్‌ తండ్రి పార్థివదేహం వద్ద కదలకుండా నిలబడిపోయారని పేర్కొన్నారు.

ఎస్పీజీ భద్రత తొలగింపుపై ప్రస్తావన
రాజీవ్‌ గాంధీ హత్యకు ఏడాదికి పైగా ముందు ఆయనకు కల్పించిన స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్​పీజీ) భద్రతను అప్పటి వీపీ సింగ్‌ ప్రభుత్వం ఉపసంహరించిందని సోనియా పుస్తకంలో ప్రస్తావించారు. అంతకుముందు డిసెంబరులో జరిగిన సమావేశంలో, కొత్తగా ఏదైనా ముప్పు అంచనా వేస్తే తప్ప ఎస్పీజీ భద్రత కొనసాగించాలని నిర్ణయించినప్పటికీ, అలాంటి సమీక్ష జరగకుండానే మరుసటి నెలలో భద్రతను తొలగించారని ఆరోపించారు. ప్రత్యేక శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది స్థానంలో స్థానిక పోలీసుల రక్షణ మాత్రమే మిగిలిందని పేర్కొన్నారు.

ప్రియాంక చెప్పిన వార్తతో కుప్పకూలిన సోనియా
1991 మే 21న తనకు సాధారణ రోజుగానే ప్రారంభమైందని సోనియా గుర్తుచేసుకున్నారు. రాజీవ్‌ ఇంట్లో లేని సమయంలో ఆయన పడుకునే మంచం వైపు చూసి ఓదార్పు పొందేదాన్నని రాశారు. మరోవైపు ప్రియాంక స్నేహితురాలి పుట్టినరోజు వేడుకకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రాహుల్‌ అప్పట్లో అమెరికాలోని కళాశాలలో చదువుకుంటున్నారు. ఇంతలో ప్రియాంక వేగంగా తన గదిలోకి వచ్చారని, ఆమె ముఖం పాలిపోయి, శ్వాస వేగంగా ఉందని సోనియా వివరించారు. బాంబు పేలుడు జరిగిందని, పలువురు చనిపోయారని, వెంటనే మద్రాసుకు వెళ్లేందుకు సిద్ధం కావాలని ప్రియాంక చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. మొదట ఆమె మాటలు తనకు అర్థం కాలేదని, కానీ ప్రియాంక గొంతులోని భయం పరిస్థితి తీవ్రతను తెలియజేసిందని పేర్కొన్నారు. రాజీవ్‌ గాంధీకి ఏమైందో తెలుసుకునేందుకు పార్టీ నాయకులు, సన్నిహితులకు ఫోన్లు చేసినట్లు సోనియా తెలిపారు. చివరకు జార్జ్‌తో మాట్లాడినప్పుడు రాజీవ్‌ ఇక లేరనే చేదు నిజం తెలిసిందని రాశారు. ఆ వార్త విన్న వెంటనే కుమార్తె ప్రియాంకను పట్టుకుని విలపించానని, 'నేను ఆయనతో వెళ్లాల్సింది, ఎందుకు వెళ్లలేదు?' అని పదేపదే అన్నానని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తన ప్రపంచమంతా చీకటిగా మారిపోయినట్లు అనిపించిందని భావోద్వేగంగా వివరించారు.

ప్రియాంకే కుటుంబానికి ధైర్యం
రాజీవ్‌ మరణవార్త తెలిసిన తర్వాత ఇంట్లోని సిబ్బంది కన్నీరుమున్నీరుగా విలపించారని సోనియా పేర్కొన్నారు. తాను తీవ్ర దిగ్భ్రాంతితో నిలబడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రియాంక తనను పట్టుకుని గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారని చెప్పారు. తాను బాధలో కుంగిపోయినప్పటికీ ప్రియాంక మాత్రం ధైర్యంగా వ్యవహరించారని, తన ముందు ఒక్కసారి కూడా కన్నీరు పెట్టుకోలేదని రాశారు. రాజీవ్‌ పార్థివదేహాన్ని తీసుకొచ్చే విమానంలో తాము కూడా వెళ్లేందుకు అనుమతించాలని ఆమె పట్టుబట్టారని, అవసరమైతే సొంత ఏర్పాట్లు చేసుకుంటామని స్పష్టం చేశారని సోనియా గుర్తుచేసుకున్నారు.

నేత్రదానం గురించి గుర్తొచ్చిన క్షణం
రాజీవ్‌ పార్థివదేహం దిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకొచ్చిన తర్వాత ఆయనను చూడాలనే బలమైన కోరిక కలిగిందని సోనియా తెలిపారు. ఆ సమయంలో రాజీవ్‌ తన కళ్లను దానం చేయాలని నిర్ణయించుకున్న విషయం గుర్తొచ్చిందన్నారు. ఈ విషయాన్ని కుటుంబ వైద్యుడికి తెలియజేయాలని ప్రయత్నించగా, పేలుడు తీవ్రత కారణంగా కళ్లను కాపాడటం సాధ్యం కాలేదని ఆయన చెప్పినట్లు పేర్కొన్నారు. ఆ సమాధానం తనను మరింత కుంగదీసిందని రాశారు.

Tags: