ఆధార్‌కు బదులు ఓటర్ ఐడీ.. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సర్ ఎసరు?
టీ మీడియా, నవంబరు 4, ఢిల్లీ బ్యూరో : ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష (సర్)పై ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ.. కేంద్రంలోని మోదీ సర్కార్ చర్యలు ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ‘సర్’ ప్రక్రియ ద్వారా అక్రమంగా లక్షలాది ఓట్లను తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న క్రమంలో సంక్షేమ పథకాలకు ఓటర్ ఐడీని ముడిపెట్టే దిశగా కేంద్రం అడుగులు వేస్తుండటం గుబులు రేపుతున్నది. ఇప్పటివరకు అన్ని పథకాలకు ఆధార్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటుండగా, ఇకపై ఆధార్‌కు బదులుగా ఓటరు కార్డునే ఆధారంగా తీసుకోవాలని కేంద్రం భావిస్తున్నది.
కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్‌సింగ్) ఇటీవల చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పంచాయతీరాజ్ శాఖ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఆధార్ కాదు.. ఓటరు కార్డే ఇక ఆధారం అంటూ ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితాల సవరణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల గుర్తింపునకు ఓటరు కార్డును ప్రామాణికంగా తీసుకోవాలన్న కేంద్ర మంత్రి ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఓటరు కార్డే ఆధారం!
‘పంచాయతీ రాజ్ పథకాల కింద ప్రభుత్వ ప్రయోజనాలు పొందేందుకు ఆధార్‌కార్డుకు బదులుగా ఓటరు గుర్తింపు కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నట్టు కేంద్ర మంత్రి లలన్ సింగ్ ప్రకటించారు. లబ్ధిదారులు తమ ఓటరు గుర్తింపు కార్డు నంబర్(ఈపీఐసీ)తో పాటు బయోమెట్రిక్ వివరాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. శుక్రవారం జన్ యోజన అభియాన్‌పై నిర్వహించిన జాతీయ స్థాయి వర్క్‌షాప్‌లో ఆయన ఈ ప్రకటన చేశారు. లబ్ధిదారులకు చెల్లింపులు చేయడానికి ఇకపై ఆధార్‌ను ప్రామాణికంగా పరిగణించబోమని పేర్కొన్నారు. ఆధార్ కార్డులు జారీ చేసే సంస్థలు దాదాపు ప్రతి ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయని, ఐదు నిమిషాల్లోనే ఎవరికైనా ఆధార్ కార్డు సృష్టించే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అందువల్ల లబ్ధిదారుల గుర్తింపునకు ఆధార్‌కు బదులుగా ఓటరు కార్డు నంబర్, బయోమెట్రిక్ వివరాలను ఉపయోగిస్తామని చెప్పారు. అయితే ఈ విధానం ద్వారా ఏయే పథకాల ప్రయోజనాలు లేదా చెల్లింపులు అందిస్తారన్న విషయాన్ని మంత్రి స్పష్టంగా వెల్లడించలేదు.
ఓటరు జాబితాల సవరణలపై ఆందోళనల వేళ..
దేశవ్యాప్తంగా సర్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఓటరు కార్డును లబ్ధిదారుల గుర్తింపునకు ఆధారంగా తీసుకోవాలన్న ప్రకటన వెలువడింది. ఈ ప్రక్రియలో నిజమైన ఓటర్ల పేర్లు తొలగిపోయే ప్రమాదం ఉన్నదని ప్రతిపక్షాలు, కార్యకర్తలు, పౌరసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సర్ చేపట్టిన ప్రాంతాల్లో సుమారు 13 కోట్ల ఓటర్ల పేర్లు తొలగించినట్టు ఆయా వర్గాలు ఆరోపిస్తున్నాయి. మే నెలలో ఓటర్ల జాబితాల సవరణ చట్టబద్ధతను సమర్థించినప్పటికీ, ఒక వ్యక్తి భారత పౌరుడా కాదా అనే విషయాన్ని నిర్ణయించే అధికారం ఎన్నికల సంఘానికి ఈ ప్రక్రియ ద్వారా లభించదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కోతలు
సర్ ప్రక్రియలో ఓటు కోల్పోయిన వారికి పలు బీజేపీ పాలిత రాష్ర్టాలు సంక్షేమ పథకాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. సువేందు అధికారి నేతృత్వంలో బెంగాల్ బీజేపీ సర్కార్.. రేషన్ కార్డుదారుల వివరాలను సవరించిన ఓటర్ల జాబితాతో సరిపోల్చే ప్రక్రియను చేపట్టింది. అలాగే మహిళలకు నగదు సాయం పథకం లబ్ధిదారుల అర్హతను తిరిగి పరిశీలించాలని నిర్ణయించింది. మరోవైపు బీజేపీ పాలిత బీహార్‌లోనూ ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించిన వారికి రేషన్, ఇతర సంక్షేమ పథకాలు అందవని సీఎం సమ్రాట్ చౌదరి ప్రకటించారు.





