రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్..
కిలో కందిపప్పు రూ.100కే..
పామాయిల్, గోధుమపిండి ఎంతంటే..
టీ మీడియా,నవంబర్11, అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణతో పాటు పేదలకు ఆర్థిక ఊరటనిచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీ ధరలకే కందిపప్పు, పామోలిన్ ఆయిల్, గోధుమపిండిని పంపిణీ చేయాలని నిశ్చయించింది. ఓపెన్ మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని మరియు వాటిని రాయితీపై పేదలకు అందించాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించగా, ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో ఆమోదం తెలిపారు.
సబ్సిడీ ధరల వివరాలు ఇవే..
రేషన్ కార్డుదారులకు మార్కెట్ ధర కంటే చాలా తక్కువకే ఈ క్రింది నిత్యావసరాలను అందించనున్నారు:
కందిపప్పు: కిలో రూ. 100
గోధుమపిండి: కిలో రూ. 25
పామోలిన్ ఆయిల్: లీటరు రూ.125
మూడు నెలలకు రూ.300.60 కోట్ల రాయితీ:
మార్కెట్ జోక్య పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా రూ. 100.20 కోట్ల చొప్పున, రాబోయే మూడు నెలల కాలానికి రూ. 300.60 కోట్లు సబ్సిడీగా భరించనుంది.
ఈ మేరకు ధరల స్థిరీకరణ నిధి కింద 1.20 లక్షల టన్నుల కందులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించగా, ప్రాథమికంగా 40,338 టన్నులను కేంద్రం కేటాయించింది. ముడికందుల లభ్యతకు అనుగుణంగా సేకరణ చేపట్టడం, పప్పు తయారీ మిల్లులతో ఒప్పందాలు చేసుకోవాలని పౌరసరఫరాల సంస్థ ఎండీ, వీసీలకు ఆ శాఖ కమిషనర్ హెచ్.కన్నబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పామోలిన్ ఆయిల్‌ను పారదర్శకమైన పోటీ టెండర్ ప్రక్రియ ద్వారా సేకరించాలని సూచించారు. ఈ పథకాన్ని మూడు నెలల పరిమితి తర్వాత కూడా పొడిగించాల్సి వస్తే ముందస్తుగా ప్రభుత్వ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని లక్షలాది మంది పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు నిత్యావసరాల ఖర్చు తగ్గడమే కాకుండా, పెరిగిన ధరల నుంచి పెద్ద ఎత్తున ఉపశమనం లభించనుంది.



