hyderabad

NH-44: A Hotspot for Accidents 'Culvert' Works at Chandrayanpalli Proving Fatal

NH-44: A Hotspot for Accidents 'Culvert' Works at Chandrayanpalli Proving Fatal

By ·

Share this article
NH-44: A Hotspot for Accidents  'Culvert' Works at Chandrayanpalli Proving Fatal

 

ప్రమాదాలకు నిలయంగా  ఎన్ హెచ్    -44                                                                    

ప్రాణాలు తీస్తున్న చంద్రాయన్​పల్లి                                                        

'కల్వర్టు' పనులు
 
 

 టీమీడియా , అక్టోబర్ 27 ,  హైదరాబాద్  బ్యూరో : నిజామాబాద్ జిల్లాలోని 44వ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. చంద్రాయన్‌పల్లి వద్ద కల్వర్టు పనులు జరుగుతున్న ప్రాంతంలో ప్రమాదాలు పెరిగిపోయాయి. డైవర్షన్‌ గుర్తించలేక పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కల్వర్టు పనులు పూర్తికాక, ఆ దారిలో ప్రయాణించాలంటేనే వాహనదారుల గుండెల్లో డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నాయి.

గతేడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లా చంద్రాయన్‌పల్లి వద్ద 44వ జాతీయ రహదారి కల్వర్టుపై నుంచి వరద ప్రవహించింది. సమస్య గుర్తించిన కలెక్టర్ ఎన్​హెచ్​ఏఐ అధికారులతో చర్చించారు. కల్వర్టును విస్తరించాలని ఎన్​హెచ్​ఏఐ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించగా, విస్తరణకు అనుమతి ఇచ్చారు. అయితే నిర్మాణ సమయంలోనే కల్వర్టు ప్రమాదాలకు దారి తీస్తుందని ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు. కానీ విస్తరణ తప్పనిసరి కావడంతో పోలీసుల అనుమతితో ఇటీవల పనులు ప్రారంభించారు. ఇప్పుడు పనులు జరుగుతున్న కల్వర్టు ప్రాంతంలో తరుచూ ప్రమాదాలు జరగడం ఆందోళనకు దారి తీస్తోంది.

చంద్రాయన్‌పల్లి కల్వర్టు ప్రాంతంలో తరుచూ ప్రమాదాలు
చంద్రాయన్‌పల్లి కల్వర్టును గతంలోనే అధికారులు బ్లాక్‌స్పాట్‌గా గుర్తించారు. అయినప్పటికీ గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు దూసుకొస్తున్నాయి. రోడ్డంతా బాగానే ఉందనే ఏమరుపాటుతో వాహనాలు వేగంగా వస్తున్నాయి. కల్వర్టు చేరుకోగానే ప్రమాదవశాత్తు వాహనాలు బోల్తా పడుతున్నాయి. కల్వర్టు పనులు జరుగుతున్న ప్రాంతంలోనే సెప్టెంబర్ 1న టమాటా లారీ బోల్తా పడి సరకుతో పాటు వాహనం దెబ్బతింది.

అదే నెల 3న బత్తాయి లారీ, 5న స్టీల్ లోడ్ ట్రక్కు ప్రమాదానికి గురయ్యాయి. అదే నెల 9న రెండు లారీలు ఢీకొని ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ద్విచక్ర వాహనం, లారీ ఢీకొని ఓ మహిళ దుర్మరణం చెందారు. తాజాగా రెండు కార్లను ఇదే కల్వర్టు వద్ద ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. వరుస ఘటనలు జరుతున్నందున కల్వర్టు పనులను త్వరగా పూర్తి చేసి ప్రమాదాలకు స్వస్తి పలకాలని స్థానికులు కోరుతున్నారు.

రాత్రి సమయాల్లో రోడ్డు ప్రమాదాలు
కల్వర్టు నిర్మాణ స్థలం పూర్తిగా వంపు ప్రాంతం కావడంతో వేగం నియంత్రణ సాధ్యం కాక ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసుల సమన్వయంతో నిరంతరం మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఉందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు వేగంగా వచ్చి ప్రమాదాలకు గురవుతున్నాయని అంటున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గుత్తేదారు పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వారం రోజుల్లో ఒకవైపు కల్వర్టు నిర్మాణం పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. రెండోవైపు మరింత వేగంగా పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని స్థానికులు కోరుతున్నారు. పనులు పూర్తయ్యే వరకు ప్రమాదాలను నివారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags: