మాకూ కావాలి ఓ 'జాబ్ కార్డు'
'కరవు పని'కి ఫుల్ డిమాండ్!
టీమీడియా , అక్టోబర్ 26 , హైదరాబాద్ బ్యూరో : ఎల్నినో పరిస్థితుల్లో కరవును అధిగమించే అంశంపై రాష్ట్రంలోని గ్రామీణులు దృష్టి సారిస్తున్నారు. వారికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. పల్లెల్లో ఉపాధి పనులపై ఆసక్తి చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు జీరాంజీ పథకం కింద ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త జాబ్ కార్డుల జారీ ప్రక్రియను చేపట్టగా, దానికి మంచి స్పందన లభిస్తోంది.
కార్డులు కావాలని ఈ నెలారంభం నుంచి 2.25 లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు రాగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఇప్పటి వరకు 39,188 కుటుంబాలకు వాటిని జారీ చేశాయి. దీని ద్వారా 1,90,184 మంది లబ్ధి పొందనున్నారు. ఎల్నినో కారణంగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వల్ల పంటల సాగు తగ్గి వ్యవసాయ కూలీలకు పనులు దొరకడం లేదు. యాసంగిలోనూ పంటల సాగు చాలా కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో పనులు లభించే అవకాశం లేదని ప్రభుత్వం గుర్తించింది.
కొత్త కార్డుల కోసం 2 లక్షల కుటుంబాల దరఖాస్తులు
ప్రభుత్వం వారికి కొత్త జాబ్ కార్డులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 18 ఏళ్లు నిండి ఇప్పటి వరకు కార్డులు పొందని వారికి కొత్తగా కార్డులు ఇవ్వాలని సూచించింది. దీనికి అనుగుణంగా పంచాయతీ కార్యదర్శలు గ్రామాల్లో చాటింపు వేయించి కొత్త కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. దీనికి 12,760 గ్రామాల నుంచి 2,25,302 కుటుంబాలు దరఖాస్తులు చేసుకున్నాయి. అందులో ఇప్పటి వరకు జారీ అయిన 39,188 కార్డుల్లో అత్యధికంగా 2,800 కుటుంబాల వారు నిజామాబాద్ జిల్లా వారు కావడం గమనార్హం.
అలాగే రాష్ట్రంలోని ఆదివాసీ గిరిజనులపై ప్రత్యేక దృష్టి సారించి కార్డులు ఇవ్వాలని తాజాగా ప్రభుత్వం ఆదేశించడంతో ఆయా ప్రాంతాల్లో కార్డుల సంఖ్యను పెంచనున్నారు. కొత్త కార్డులతో కలిపి రాష్ట్రంలో ప్రస్తుతం 52,51,582 కుటుంబాలకు చెందిన 1.02 కోట్ల మంది జాబ్ కార్డులు తీసుకున్నారు.
ప్రతి 40 మంది కూలీలకు ఒక 'మేట్'
జీరాంజీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో పెద్దఎత్తున ఉపాధి కల్పించాలనే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కూలీల సమీకరణ, పనుల అప్పగింత కోసం రోజ్గార్ సేవక్ (మేట్)లను నియమించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు నిర్ణయించాయి. ప్రతి 40 మంది కూలీలకు ఒకరి చొప్పున గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో వీరిని ఎంపిక చేయాలని అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులను ఆదేశించాయి.
గ్రామాల్లో కూలీల గుర్తింపు, పనులకు తీసుకెళ్లే బాధ్యతలను క్షేత్ర సహాయకులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ గ్రామాల్లో పూర్తి స్థాయిలో అవసరమైన వారికి ఉపాధి లభించడం లేదని పంచాయతీరాజ్ శాఖ గుర్తించింది. ఈ క్రమంలో మేట్లను నియమించి ఆ బాధ్యతలను వారికి అప్పగించాలని తాజాగా ఆదేశాలిచ్చింది. ఎంపిక చేసిన మేట్ల వివరాలపై జిల్లాల వారీగా నివేదికలు ఇవ్వాలని, బాధ్యతల నిర్వహణపై మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించింది.
సరిపడా వర్షాల్లేక ఇలా
ఈ సీజన్లో కనీస వర్షాల్లేక సాగు ఇబ్బందిగా మారింది. భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం వీబీ జీరాంజీ పథకాన్ని సమర్థంగా వినియోగించుకోవాలంటూ పదేపదే చెబుతోంది. దానికి అనుగుణంగా కార్యాచరణ అమలుపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ దృష్టి సారించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి 25 శాతం పని దినాలు, కొత్తగా 95 పని రకాలు పెరగడం కొంత కలిసి రానుంది.






