కేరళ

Sabarimala Mandala Puja Begins Ayyappa Devotees Throng the Temple on the Very First Day!

Sabarimala Mandala Puja Begins Ayyappa Devotees Throng the Temple on the Very First Day!

By ·

Share this article
Sabarimala Mandala Puja Begins  Ayyappa Devotees Throng the Temple on the Very First Day!

 

 

శబరిమల మండల పూజ ప్రారంభం                                                                                           

 తొలిరోజే పోటెత్తిన అయ్యప్ప భక్తులు!
 
 
 టీమీడియా , నవంబర్ 17, కేరళ :కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల- మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్‌ ప్రారంభమైంది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచారు. 'స్వామియే శరణం అయ్యప్ప' నామస్మరణలతో శబరిమల కొండ మార్మోగింది. తొలి రోజే వేలాది మంది భక్తులు అయ్యప్ప స్వామి దర్శనం కోసం తరలివచ్చారు. రానున్న రెండు నెలల పాటు కొనసాగే ఈ వార్షిక తీర్థయాత్రకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

సోమవారం సాయంత్రం నుంచే ఆలయాల్లో ముందస్తు సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు. మలయాళ క్యాలెండర్‌ ప్రకారం వృశ్చిక మాసం ప్రారంభమైన సందర్భంగా ఆలయాన్ని భక్తుల దర్శనార్థం తెరిచారు. కొత్తగా నియమితులైన ప్రధాన అర్చకుడు అరీక్కర సుబ్రమణియన్‌ శంకరన్‌ నంబూద్రి ఆలయ ద్వారాలను తెరిచి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. అదే సమయంలో మాలికప్పురం ఆలయాన్ని కూడా తెరిచారు. అక్కడ కొత్త ప్రధాన అర్చకుడు ఏ. దామోదరన్‌ నంబూద్రి పూజలు నిర్వహించారు.

దర్శనానికి భారీగా ముందస్తు బుకింగ్స్‌
ఈ ఏడాది యాత్ర ప్రారంభ రోజుల్లోనే భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దర్శనం కోసం వర్చువల్‌ క్యూ విధానంలో ఇప్పటికే 66 వేల మంది ముందస్తు నమోదు చేసుకున్నారు. మరో 14 వేల మంది స్పాట్‌ బుకింగ్‌ ద్వారా దర్శనం పొందేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. రోజుకు గరిష్ఠంగా 80 వేల మంది భక్తులకు దర్శనం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసు యంత్రాంగం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ముఖ్యంగా ఆలయంలోని 18 పవిత్ర మెట్ల వద్ద భక్తుల రాకపోకలను క్రమబద్ధీకరించడం ప్రధాన సవాలుగా మారింది. నిమిషానికి సుమారు 75 మంది భక్తులు మెట్లు ఎక్కేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

స్పాట్‌ బుకింగ్‌కు ప్రత్యేక కేంద్రాలు
ఆన్‌లైన్‌లో దర్శనం కోసం నమోదు చేసుకోని భక్తుల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో స్పాట్‌ బుకింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రధాన బేస్‌ క్యాంప్‌ నీలక్కల్‌తో పాటు ఎరుమేలి, వండిపెరియార్‌ సమీపంలోని సత్రం ప్రాంతాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే పంపా వద్ద స్పాట్‌ బుకింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. అక్కడ బుకింగ్‌ సౌకర్యం కల్పిస్తే నదీ తీరంలోని యాత్రికుల కేంద్రంలో రద్దీ పెరిగే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. అందువల్ల ఆన్‌లైన్‌లో టికెట్లు పొందని భక్తులు ఆలయానికి బయలుదేరే ముందే నిర్దేశిత కేంద్రాల్లో స్పాట్‌ బుకింగ్‌ చేసుకోవాలని సూచించారు.

రద్దీ నియంత్రణకు ఏఐ కెమెరాలు
యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు పలు చర్యలు చేపట్టింది. ఆలయ పరిసరాల్లో మెరుగైన లైటింగ్‌, పారిశుద్ధ్య నిర్వహణ, భక్తుల రాకపోకల క్రమబద్ధీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నీలక్కల్‌ వాహనాల పార్కింగ్‌ ప్రాంతం నుంచి భక్తుల కదలికలను పర్యవేక్షించేందుకు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా రద్దీ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసి అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. మంగళవారం అన్ని శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కే జయకుమార్ తెలిపారు. యాత్ర మొదటి రోజున అధికారులు, ఇతర శాఖల మధ్య వాతావరణం అత్యంత స్నేహపూర్వకంగా ఉండటం తనకు సంతోషంగా ఉందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

డిసెంబర్‌ 27న మండల పూజ
ఈ ఏడాది మండల తీర్థయాత్ర డిసెంబర్‌ 27న నిర్వహించే మండల పూజతో ముగియనుంది. అనంతరం అదే రోజు ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి డిసెంబర్‌ 30 సాయంత్రం 5 గంటలకు మకరవిళక్కు తీర్థయాత్ర కోసం ఆలయ ద్వారాలు తెరుస్తారు. జనవరి 14న మకరవిళక్కు మహోత్సవం నిర్వహించనున్నారు. జనవరి 19 వరకు భక్తులకు అయ్యప్ప దర్శనానికి అనుమతి ఉంటుంది. జనవరి 20న ఆలయాన్ని మూసివేయనున్నారు.

Tags: