ఆడుకుంటున్న ఏడాది బాబుపై కొండచిలువ దాడి.. మింగేందుకు ప్రయత్నం..
టీ మీడియా, నవంబరు 4, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఎనిమిదో వార్డులో ఏడాది చిన్నారిపై కొండచిలువ మింగేందుకు ప్రయత్నం చేసింది. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న కొట రాజు, పద్మ దంపతుల ఏడాది కుమారుడు శ్రీకాంత్‌పై ఒక్కసారిగా కొండచిలువ దాడి చేసింది. చిన్నారిని కొండచిలువ కాలుపై దాడి చేసి.. బాబును చుట్టుకొనే ప్రయత్నం చేసింది. బాబు భయంతో బిగ్గరగా అరవడంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. చిన్నారిపై దాడి చేస్తున్న కొండచిలువను చూసి ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు.. దానిని హతమార్చారు. అనంతరం ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాలుడిని ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
కొండచిలువ ఒక్కసారి చుట్టుకుంటే దానిని విడదీయడం చాలా కష్టం. బాబు కాలుపైన మొదట దాడి చేసి తర్వాత మింగేందుకు ప్రయత్నం చేసింది. భయంతో బాబు అరవడంతో కుటుంబసభ్యులు బయటికి వచ్చారు. వెంటనే బాబులు చేతిలోకి తీసుకొని.. కొండచిలవపైన దాడి చేసి హతమార్చారు. కొద్దిగా ఆలస్యమైతే పెద్ద ప్రమాదమే జరిగేది. కుటుంబ సభ్యులు చాకచక్యంగా వ్యవహరించి కొండ చిలువ దాడి నుంచి బాబును తప్పించారు. ఇటీవల కాలంలో కొండచిలువల సంచారం పెరిగిపోయింది. దాడులు కూడా చేయడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.
ముస్తాబాద్ ఎనిమిదో వార్డులోని ఈ కాలనీ పక్కనే పంట పొలాలకు నీటిని సరఫరా చేసే మానేరు కాలువ ఉండటంతో పాములు, కొండచిలువలు జనావాసాల్లోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా కాలనీలో సరైన వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో చిమ్మచీకటి అలుముకుంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల పొలాలు, కాలువ ప్రాంతం నుంచి విషపూరిత పాములు ఇళ్ల పరిసరాల్లోకి వస్తున్నా గుర్తించడం కష్టంగా మారిందని అంటున్నారు. తాజాగా ఏడాది చిన్నారిపై కొండచిలువ దాడి ఘటనతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు.
కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, కాలనీ పరిసరాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని పలుమార్లు కోరినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. రాత్రి వేళల్లో చిన్నారులు, మహిళలు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. చిన్నారిపై కొండచిలువ దాడి ఘటనలో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నప్పటికీ.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
