karepalli khammam district

కరెంట్‌ పోతే.. కారేపల్లి ఆసుపత్రిలో చీకట్లే!

కరెంట్‌ పోతే.. కారేపల్లి ఆసుపత్రిలో చీకట్లే!

By ·

Share this article
కరెంట్‌ పోతే.. కారేపల్లి ఆసుపత్రిలో చీకట్లే!

కరెంట్‌ పోతే.. కారేపల్లి ఆసుపత్రిలో చీకట్లే!

పనిచేయని ఇన్వర్టర్లు..

నిరుపయోగంగా సోలార్‌ వ్యవస్థ

రాత్రివేళ అత్యవసర వైద్యసేవలకు టార్చ్‌లైట్లే ఆధారం?

గర్భిణులు,అత్యవసర రోగుల పరిస్థితిపై ఆందోళన

టీ మీడియా,అక్టోబర్30,సింగరేణి(కారేపల్లి):ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాల్సిన కారేపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కనీస మౌలిక సదుపాయాల కొరతతో సమస్యల నిలయంగా మారుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా రాత్రివేళ విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే ఆసుపత్రిలో చీకట్లు అలుముకుంటుండటంతో వైద్యసేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్‌ సరఫరాకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన ఇన్వర్టర్లు పనిచేయకపోవడం,సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థ సైతం పూర్తిస్థాయిలో వినియోగంలో లేకపోవడంతో కరెంట్‌ పోయిన సమయంలో వైద్య సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.కొన్ని సందర్భాల్లో సెల్‌ఫోన్‌ టార్చ్‌ల వెలుగులో వైద్యసేవలు అందించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

 

 

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు సహా అవసరమైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశిస్తున్నప్పటికీ,అందుకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు క్షేత్రస్థాయిలో అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.ముఖ్యంగా రాత్రివేళ గర్భిణులు,ప్రమాద బాధితులు,ఇతర అత్యవసర రోగులు ఆసుపత్రికి వస్తే విద్యుత్‌ కోత సమయంలో వైద్యం ఎలా అందిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది.లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఇన్వర్టర్లు,సోలార్‌ వ్యవస్థలు అవసరమైన సమయంలో ఉపయోగపడకపోతే వాటి ఏర్పాటు వల్ల ప్రయోజనం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.వైద్యశాల వంటి అత్యవసర సేవల కేంద్రంలో నిరంతర విద్యుత్‌ సరఫరాతోపాటు ప్రత్యామ్నాయ విద్యుత్‌ వ్యవస్థ ఎప్పటికప్పుడు పనిచేసేలా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.ఇప్పటికైనా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించి ఆసుపత్రిలోని ఇన్వర్టర్లు,సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థ పనితీరును పరిశీలించి తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.రాత్రివేళ విద్యుత్‌ కోత వచ్చినా వైద్యసేవలకు అంతరాయం కలగకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.