90 రోజుల్లో ప్రజలకు 20 కోట్ల డోసుల టీకా.. లక్ష్యాన్ని 20 కోట్లకు పెంచిన బైడెన్‌

0
TMedia (Telugu News) :

90 రోజుల్లో ప్రజలకు 20 కోట్ల డోసుల టీకా.. లక్ష్యాన్ని 20 కోట్లకు పెంచిన బైడెన్‌

టీకా ముడిపదార్థాల ఎగుమతిపై నిషేధంతో భారత్‌లో ‘కొవిషీల్డ్‌’కు ఆటంకం

s s consultancy

న్యూఢిల్లీ, మే 9: ప్రపంచమంతటికీ కరోనా వ్యాక్సిన్లు ఎగుమతి చేస్తున్న భారత్‌ టీకాల కొరతతో అల్లాడిపోతుంటే.. అమెరికా ఇప్పటికే తన జనాభాలో సగం మందికిపైగా ప్రజలకు టీకాలు వేసేసింది! అంతేకాదు.. తమ అవసరాలకు మించి టీకా నిల్వలను సాధించుకోగలిగింది. ఆరోగ్య భద్రతలో మిగతా దేశాలకు ఆదర్శప్రాయంగా దూసుకుపోతోంది. అమెరికా సాధించిన ఈ విజయానికి మాజీ అధ్యక్షుడు ట్రంప్‌, తాజా అధ్యక్షుడు బైడెన్‌ ఇద్దరూ కీలకమే. గత ఏడాది మార్చి నెలలో కరోనా వైరస్‌ ప్రపంచమంతా విరుచుకు పడుతున్న దశలో అందరికన్నా ముందు ట్రంప్‌ వేగంగా స్పందించారు. ఆ దేశంలో అధికారికంగా మార్చి 16 నుంచి కొవిడ్‌ కేసుల గణాంకాలను నమోదు చేస్తున్నారు. వరల్డో మీటర్స్‌ గణాంకాల ప్రకారం మార్చి 16న అమెరికాలో 1124 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 10 రోజులకే.. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ట్రంప్‌ ‘ఆపరేషన్‌ వార్ప్‌స్పీడ్‌’ పేరిట టీకాల తయారీ దిశగా ఆలోచించారు. ‘కేర్స్‌ యాక్ట్‌ (కరోనా వైరస్‌ ఎయిడ్‌, రిలీఫ్‌, అండ్‌ ఎకనమిక్‌ సెక్యూరిటీ) పేరిట 10 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.75 వేల కోట్ల) నిధిని ప్రాథమికంగా ఏర్పాటు చేసి పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ఫార్మా కంపెనీలకు అండగా నిలిచారు. ఆ తర్వాత బర్డా (బయోమెడికల్‌ అడ్వాన్స్‌డ్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ) ద్వారా అదనపు నిధులు సమకూర్చారు. అలాగే. టీకాలు తయారయ్యాక అమెరికాకు ఇన్ని డోసుల టీకాలు కావాలంటూ ఆయా కంపెనీలతో ముందుగానే ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
మార్చి 27న కేర్స్‌ యాక్ట్‌ అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం పొందింది. ప్రభుత్వం నుంచి ఈ స్థాయిలో సహకారం లభ్యం కావడంతో.. ఆర్డర్‌ కూడా ముందే రావడంతో.. ఫార్మాకంపెనీలు వేగంగా టీకాల తయారీకి కృషి చేశాయి. అలాగే, తగినన్ని డోసులను అందుబాటులోకి తెచ్చాయి. ఫలితంగా.. డిసెంబరు 14 నుంచి అమెరికన్లకు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. జనవరి 20న.. ట్రంప్‌ నుంచి బైడెన్‌ అధికార పగ్గాలు చేపట్టే నాటికి అమెరికా పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దీన్ని సవాల్‌గా తీసుకున్న జో బైడెన్‌ 100 రోజుల్లో 10 కోట్ల డోసుల టీకా ప్రజలకు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అధికార యంత్రాంగం సమర్థంగా పనిచేయంతో.. మార్చి 25 నాటికి, అంటే 64 రోజుల్లోనే ఆ లక్ష్యాన్ని సాధించగలిగారు. దీంతో బైడెన్‌ తన లక్ష్యాన్ని 20 కోట్లకు పెంచారు. దాన్ని కూడా 10 రోజుల ముందే.. అంటే 90 రోజుల్లోనే ఛేదించారు. ఫలితంగా.. ఒకప్పుడు రోజుకు అత్యధికంగా 3.07 లక్షల కేసులు, రోజుకు దాదాపు 4,500 మరణాలతో అల్లాడిన అమెరికా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటోంది. మరణాలు 455 మాత్రమే. ఈ నేపథ్యంలో.. అమెరికా స్వతంత్ర దినమైన జూలై 4 కల్లా 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వడం ద్వారా కరోనా భయ రహితంగా స్వాతంత్ర దినోత్సవాలను జరపాలని బైడెన్‌ కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. 20 కోట్ల లక్ష్యం దాటడం అద్భుత విజయమని కొనియాడారు. అమెరికా చరిత్రలో కానీ, ప్రపంచ చరిత్రలో కానీ ఇంత భారీ లక్ష్య సాధన ఇంతవరకు జరగలేదని చెప్పారు. టీకా వేసుకొనే పౌరులకు ఒక రోజు సెలవు ఇచ్చే కంపెనీలన్నింటికీ పన్ను రాయితీలు ప్రకటించారు. అయితే, ఇప్పుడే కొవిడ్‌పై విజయం సాధించామని సంబరపడిపోకూడదని దేశ ప్రజలను హెచ్చరించారు. అప్రమత్తంగా లేకపోతే ఇప్పటిదాకా సాధించిందంతా వృధా అవుతుందని అన్నారు. నిజంగానే మిషిగన్‌ లాంటి రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు పెరగడం కొంత ఆందోళన కలిగిస్తోంది.

‘అమెరికా ఫస్ట్‌’ విధానంతో భారత్‌కు నష్టం

అమెరికాయే ముందు అనే నినాదంతో తన లక్ష్యాన్ని సాధించుకోవడానికి.. డిఫెన్స్‌ యాక్ట్‌ను అమల్లోకి తేవాలని బైడెన్‌ తీసుకున్న నిర్ణయంతో భారతదేశానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఆ చట్టం ప్రకారం టీకా తయారీకి అవసరమైన ముడిపదార్థాల ఎగుమతిపై నిషేధం విధించడంతో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కొవిషీల్డ్‌ టీకాల ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. దీంతో తగినన్ని టీకాలు అందుబాటులోకి రాక మనదేశంలో వ్యాక్సినేషన్‌ వేగం తగ్గిపోయింది. అమెరికా 90 రోజుల్లో (గత బుధవారానికి) 20 కోట్ల డోసులు వేస్తే.. మనదేశంలో జనవరి 16 నుంచి ఆదివారం దాకా అంటే, 113 రోజుల్లో వేసినవి 16.82 కోట్ల డోసులు. అందులోనూ రెండు డోసులూ వేయించుకున్నవారు కేవలం 3.4 కోట్ల మంది మాత్రమే. 13.38 కోట్ల మంది మొదటిడోసు వేయించుకున్నారు. అదే అమెరికాలో అయితే శనివారం నాటికి 25.7 కోట్ల డోసుల టీకా వేశారు. 11.3 కోట్ల మంది.. అంటే అమెరికా జనాభాలో 34.3 శాతం మంది రెండు డోసుల టీకా తీసుకున్నారు. ఇప్పుడు అమెరికా వద్ద ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాలే అవసరానికన్నా ఎక్కువగా ఉన్నాయి. దీంతో.. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తమకు వచ్చే ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకాలన్నింటినీ వేరే దేశాలకు ఇచ్చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే కెనడా, మెక్సికో దేశాలకు అమెరికా టీకాలను సరఫరా చేస్తోంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.