సద్దుల బతుకమ్మకు ప్రత్యేక ఏర్పాట్లు
చింతల చెరువు వద్ద 13 చోట్ల 100 వాట్ల వీధి దీపాల ఏర్పాటు
టీ మీడియా, అక్టోబర్ 18, అశ్వాపురం:
సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని అశ్వాపురం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. బతుకమ్మ నిమజ్జనానికి వచ్చే ఆడపడుచులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చింతల చెరువు పరిసరాల్లో విద్యుత్ దీపాలు, పారిశుధ్య నిర్వహణకు చర్యలు తీసుకున్నారు.
అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలోని 23 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మలను కొమ్ముగూడెం వైపు వెళ్లే దారిలోని చెరువు అలుగు వద్ద, అలాగే ఎస్సీ కాలనీలోని చెరువులోకి దిగే అలుగు వద్ద నిమజ్జనం చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రాంతాల్లో మొత్తం 13 చోట్ల 100 వాట్ల వీధి దీపాలను ఏర్పాటు చేశారు. రాత్రివేళల్లో నిమజ్జనానికి వచ్చే మహిళలకు తగినంత వెలుతురు అందేలా చర్యలు చేపట్టడంతో పాటు, పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా అశ్వాపురం సర్పంచ్ బానోతు సదర్ లాల్ మాట్లాడుతూ, సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా నిమజ్జనానికి వచ్చే ఆడపడుచులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గ్రామపంచాయతీ తరఫున అన్ని అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వీధి దీపాల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని పేర్కొన్నారు.
అలాగే రాత్రివేళల్లో నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సీఐ ఎల్లయ్యను ఫోన్ ద్వారా కోరినట్లు సర్పంచ్ తెలిపారు. దీనిపై సీఐ సానుకూలంగా స్పందించి, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బానోతు సదర్ లాల్, ఉప సర్పంచ్ తుల్లూరి ప్రకాష్ రావు అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ పండుగను సంతోషంగా, భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తుల్లూరి ప్రకాష్ రావు, గ్రామ పెద్దలు ఈసంపల్లి కృష్ణ, గద్దల రామకృష్ణ, మిర్యాల బాలకృష్ణ, భూతం వెంకటేశ్వర్లు, మెడ అబ్బాయి, తడబోయిన వెంకటేశ్వరులు, నూకల లింగయ్య, కన్నెబోయిన లింగరాజు, శీలం సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది సైతం ఏర్పాట్లలో సహకరించారు.

