90% బాలలు.. స్మార్ట్‌ బానిసలు! —-

0
TMedia (Telugu News) :

ఇటు ఆన్‌లైన్‌ తరగతులు.. అటు ఛాటింగ్‌
సెల్‌ఫోన్‌ అతి వినియోగం.. ఆరోగ్యంపై దుష్ప్రభావం
స్క్రీన్‌ సమయం 2 గంటలు మించొద్దు
వెల్లడించిన ఎన్‌సీపీసీఆర్‌ అధ్యయనం
హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ తరగతులంటూ చిన్నారులు ఎక్కువ సమయం మొబైల్‌ స్క్రీన్‌ ముందు గడపటం వారి ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌(ఎన్‌సీపీసీఆర్‌) ఆందోళన వ్యక్తం చేసింది. రోజుకు ఆ తరగతులు రెండు గంటల సమయానికి పరిమితం చేయాలని సూచించింది. కరోనాతో డిజిటల్‌ క్లాసులు ప్రారంభమైన క్రమంలో ప్రతి పది మంది పిల్లల్లో ఏకంగా తొమ్మిది మంది సెల్‌ఫోన్‌కు బానిస అవుతున్నట్లు వెల్లడించింది. ఆన్‌లైన్‌ చదువులకు స్మార్ట్‌ఫోన్లే కీలకమని 94.8 శాతం మంది పిల్లలు అభిప్రాయపడుతుండటంతో తల్లిదండ్రులు వారికి వాటినిస్తున్నట్లుగా సర్వే తేల్చింది. పిల్లలు 13 ఏళ్ల వయసు నుంచి సొంతంగా ఫోన్లు కొంటున్నారని, 9-17 ఏళ్ల విద్యార్థుల్లో 30.2 శాతం మందికి ఇప్పటికే ఫోన్లు ఉన్నాయని అది పేర్కొంది. ‘మొబైల్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ పరికరాల వినియోగం – పిల్లల్లో శారీరక, మానసిక, ఆలోచనలపై ప్రభావం’ పేరిట ఎన్‌సీపీసీఆర్‌ సర్వే చేసింది. దేశంలోని దిల్లీ, హైదరాబాద్‌, ముంబయి, భువనేశ్వర్‌, గువాహటి నగరాల్లోని 60 కార్పొరేట్‌, ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లోని 9-17 ఏళ్ల విద్యార్థులపై రాంబావు మాల్గీ ప్రబోధిని సంస్థ(ఆర్‌ఎంపీ)తో కలిసి అధ్యయనం చేసింది. ఈ సర్వేలో 3491 మంది విద్యార్థులు, 1534 మంది తల్లిదండ్రులు, 786 మంది టీచర్లు పాల్గొన్నారు. ఆన్‌లైన్‌ కన్నా ప్రత్యక్ష తరగతులతో మెరుగైన విద్య అందుతుందన్న అభిప్రాయం వారందరిలో వ్యక్తమైంది.
ఇవీ సమస్యలు..
నిద్రపోడానికి ముందు ఫోన్లతో గడిపే పిల్లల్లో నిద్రలేమి, ఆందోళన, నీరసం తదితర సమస్యలు తలెత్తుతున్నాయి. సర్వేలో 23.80 శాతం మంది పిల్లలు నిద్రకు ముందు మొబైల్‌ ఫోన్‌ వాడుతున్నట్లు తేలింది.
ఆన్‌లైన్‌ తరగతులపుడు మొబైల్‌ఫోన్లలో ఇతర సమాచారాన్ని వెదకడంతో చదువుపై ఏకాగ్రత, విషయ పరిజ్ఞానంలో చురుకుదనం తగ్గుతోందని 37.15 శాతం మంది పిల్లలు అంగీకరిస్తున్నారు. 13.90 శాతం మంది విద్యార్థులు నిరంతరం మొబైల్‌ స్క్రీన్‌ తనిఖీ చేస్తున్నట్లు వెల్లడైంది.
కరోనా ఉద్ధృతి ఉన్నప్పుడూ 32.70 శాతం మంది పిల్లలు ఫోన్లో చూసే కన్నా స్నేహితులను నేరుగా కలిసేందుకు బయటకు వెళ్తున్నారు.
ఇంటర్నెట్‌ వినియోగంతో సృజనాత్మక విజ్ఞానం పెరుగుతున్నట్లు 31.50 శాతం మంది పిల్లలు వెల్లడించగా, మరో 40.50 శాతం మంది అది పాక్షికంగా ఉందన్నారు.
టీవీలు, సినిమా తెరల స్థానంలో మొబైల్‌ ఫోన్లు వినోద పరికరాలుగా మారాయని 76.20 శాతం మంది తెలిపారు.
హైదరాబాద్‌లో పిల్లలపై సర్వే చేయగా 41.30 శాతం మందికి సామాజిక మాధ్యమాల్లో ఖాతాలున్నట్లు వెల్లడైంది.
ఇవీ సూచనలు
పిల్లలకు రోజుకి 2 గంటలకు మించి స్క్రీన్‌ టైమ్‌ ఉండరాదు. కౌమారదశలోని యువత తల్లిదండ్రుల పర్యవేక్షణలో కంప్యూటర్లు, ఫోన్లు తదితరాలను ఉపయోగించాలి. తల్లిదండ్రులు సైతం తమ టీవీ, స్మార్ట్‌ఫోన్‌ వినియోగం తగ్గించాలి. పిల్లలతో మాట్లాడుతూ వారి సందేహాలు తీర్చాలి.
స్మార్ట్‌ఫోన్లలోని డిజిటల్‌ వెల్‌బీయింగ్‌, పేరెంటల్‌ కంట్రోల్‌ సహాయంతో వెబ్‌, యాప్‌లపై నియంత్రణతో పాటు తల్లిదండ్రులు పిల్లలను పర్యవేక్షిస్తుండాలి.
కాలనీలు, బస్తీల్లో ఖాళీ స్థలాన్ని పిల్లల క్రీడామైదానంగా ఎంపిక చేసి ఆటలు ఆడుకునే అవకాశమివ్వాలి.
పిల్లలకు సైబర్‌క్రైమ్‌, మోసాలపై పాఠశాలల స్థాయిలో అవగాహన కల్పించాలి.

s s consultancy

The National Commission for the Protection of the Rights of the child ( NCPCR ) has expressed concern that children spending too much time in front of mobile screens in online classes is seriously effecting their health.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.