ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు?పుట్ట మధుకర్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు

0
TMedia (Telugu News) :


ఖాతాల పరిశీలనకు అధికారులకు లేఖలు

హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు దంపతులను హత్య చేసేందుకు హంతకులకు రూ.2 కోట్ల సుపారీ ఇచ్చిందెవరు? బిట్టు శ్రీను కారు కొనేందుకు డబ్బులు ఎవరిచ్చారు? కుంట శ్రీనివాస్‌ ఇంటి నిర్మాణం ఎలా జరుగుతోంది?’’ పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ విచారణలో భాగంగా పోలీసులు ఆరా తీస్తున్న అంశాలివి. న్యాయవాదుల హత్య కేసులో ఆదివారం రెండో రోజు కూడా ఈ మేరకు విచారించారు. వీటిపై నిజానిజాలను రాబట్టేందుకు పుట్ట మధుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల బ్యాంకు ఖాతాలను పరిశీలించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆయా బ్యాంకు మేనేజర్లకు పోలీసులు లేఖలు రాశారు. వారి కాల్‌ డేటానూ క్షుణ్ణంగా పరిశీస్తున్నారు. బ్యాంకు ఖాతాల వివరాలు పోలీసులకు సోమవారం మధ్యాహ్నం వరకు అందే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

పరిశీలన ద్వారా ఈ కేసులో పుట్ట మధు ప్రమేయం ఉన్నట్లుగా తేలితే ఆయనను సోమవారమో, మంగళవారమో రిమాండ్‌ చేయవచ్చని తెలుస్తోంది. మరోవైపు పుట్ట మధు భార్య, మంథని మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ శైలజకు ఆదివారం నోటీసులు జారీ చేసి కమిషనరేట్‌కు రప్పించారు. ఆమెతోపాటు కమాన్‌పూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పూదరి సత్యనారాయణగౌడ్‌ను కూడా విచారిస్తున్నారు. ఫిర్యాదుదారు గట్టు కిషన్‌రావును కూడా పిలిపించి మాట్లాడారు. ఇదిలా ఉండగా.. ఏపీలోని భీమవరంలో పోలీసులు అదుపులోకి తీసుకోకముందు పుట్ట మధు మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లా వర్నిలో ఉండే తన సోదరుడు పుట్ట సత్యనారాయణ వద్ద ఉన్నట్లు తెలిసింది. ఆయనతో ఉన్న స్నేహితుడు, ఆశ్రయం ఇచ్చిన సోదరుడిని పోలీసులు విచారించి వదిలిపెట్టారు.

s s consultancy

సంబంధం లేదంటున్న ….

న్యాయవాదుల హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని పుట్ట మధు చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఆర్థిక లావాదేవీలు, ఫోన్‌ కాల్‌ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న పుట్ట మధు మేనల్లుడు తులసిగారి శ్రీనివాస్‌ అలియాస్‌ బిట్టు శ్రీనును గత మార్చి నెలలో కోర్టుకు తీసుకువచ్చిన సందర్భంగా పుట్ట మధు భార్య శైలజ అక్కడికి వచ్చారు. తన ఫోన్‌ నుంచి ఎవరికో ఫోన్‌ చేసి బిట్టు శ్రీనుతో మాట్లాడించారు. ఈ వ్యవహారంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదు మేరకు ఆమెపై మంథని పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయింది. ఆమె ఎవరికి ఫోన్‌ చేసి బిట్టు శ్రీనుతో మాట్లాడించారనే విషయమై కూడా పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు మూడు రోజుల క్రితం ముత్తారం, మంథని, రామగిరి ఎస్‌ఐల బదిలీ జరగగా, ఆదివారం మంథని సీఐ జి.మహేందర్‌రెడ్డిని వరంగల్‌ కమిషనరేట్‌కు అటాచ్‌ చేస్తూ ఐజీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. దీనిని బట్టి చూస్తే ప్రభుత్వం పుట్ట మధు తీరు పట్ల ఎంత ఆగ్రహంగా ఉందో అర్థమవుతోంది. వామన్‌రావు దంపతుల హత్య కేసులో ఆయనను తప్పనిసరిగా అరెస్టు చేస్తారని తెలుస్తోంది.

అనుమానాలు..

హైకోర్టు న్యాయవాదుల హత్య కేసులో మొదటి నుంచి పోలీసుల తీరుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. వామన్‌రావు దంపతుల హత్య జరిగిన తర్వాత కొద్దిసేపటికి గానీ అక్కడికి పోలీసులు చేరుకోలేదని, అంబులెన్స్‌లో అతడ్ని ఆస్పత్రికి తరలించడంలో ఆలస్యమయిందని, సంఘటన జరిగిన స్థలంలో ఆధారాలు చెదిరిపోకుండా ఉండేందుకు బారికేడింగ్‌ చేయలేదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ప్రాణంతో ఉన్న వామన్‌రావుకు అంబులెన్స్‌లో వైద్యం అందించలేదని, పెద్దపల్లి ఆస్పత్రికి తీసుకవెళ్లినా కూడా వైద్యం అందించలేదని వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఆరోపించారు. పుట్ట మధు, ఆయన భార్యపై తమ కుమారుడు కేసులు వేయడం వల్లనే మధు కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని కిషన్‌రావు చెబుతున్నా కూడా పోలీసులు పట్టించుకోలేదు. ఏప్రిల్‌ 16న వరంగల్‌ ఐజీకి రాసిన లేఖ విషయాన్ని కూడా బయటకు పొక్కనివ్వలేదు. పుట్ట మధును గతంలో ఒకసారి ఈ కేసులో విచారించామని చెబుతున్నప్పటికీ.. ఎప్పుడన్నది ప్రకటించలేదు. బిట్టు శ్రీనును పుట్ట శైలజ కోర్టు వద్ద కలిసి ఫోన్‌ మాట్లాడించిన విషయంపైనా ఆలస్యంగా పిటిషన్‌ తీసుకున్నట్లు తెలిసింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.