పూజ మధ్యలో లేవకూడదా ??

0
TMedia (Telugu News) :

🌸 కొంతమంది పూజలు చేస్తూ మధ్య మధ్యలో లేచి వెళ్ళి వేరే పనులు చేయటమో, ఇంకెవరితోనో కబుర్లాడటమో, ఇంకేదైనా పనిలోకి వెళ్ళటమో చేస్తుంటారు. అలాంటి వారిలో చాలామంది ఆపిన పూజను మళ్లీ చేయకపోవటం కూడా జరుగుతూ ఉంటుంది.
పూజ మధ్యలో ఆపకూడదు…
ఆపితే మహాదోషం కలుగుతుంది…..
ఏకాగ్రత, భక్తి, ప్రశాంత చిత్తంతో చేయాల్సిన దైవ పూజలను అలా మధ్యలో ఆపితే ఏం జరుగుతుంది ?

అనే విషయాన్ని వివరిస్తుంది ఈ కథా సందర్భం.
🥀🌷🥀🌷🥀🌷🥀🌷🥀🌷🥀🌷🥀🌷🥀

ఇది స్కంద పురాణం బ్రహ్మోత్తర ఖండం
ఆరో అధ్యాయంలో కనిపిస్తుంది.

🌸 పూర్వం విదర్భ దేశాన్ని సత్యరథుడు అనే ఓ రాజు పరిపాలిస్తూ ఉండే వాడు. పేరుకు తగ్గట్టుగానే సత్యరథుడు ధార్మిక జీవనాన్ని గడుపుతూ సత్యాన్ని పాటిస్తూ ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలిస్తూ ఉండేవాడు. అ రాజు నిత్యం శివుడికి పూజలు చేసేవాడు. సత్యరథుడు చక్కగా పరిపాలన చేస్తుండటం, రాజ్యం అంతా పచ్చగా విలసిల్లుతూ ఉండటం చూసి అతడి శత్రువులు ఓర్వలేక పోయారు. ఎన్ని విధాలుగా వారు ప్రవర్తించినా సత్యరథుడికి ఇసుమంత కూడా ప్రమాదం కలుగ చేయలేక పోయారు. దానికి కారణం అతడి ధర్మ బద్ధమైన, సత్యశుద్ధమైన పరిపాలనే.

🌸 ఇలా కాలం గడుస్తుండగా ఓ రోజున సత్యరథుడు పూజలో ఉన్న సమయంలో రాజ మందిరం వెలుపల ఏదో పెద్ద అలికిడి వినిపించింది. సత్యరథుడికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. అతడి మంత్రులు అతడిని నిరంతరం కంటికి రెప్పలా కాపాడుకొనేందుకు కావలసిన చర్యలన్నీ తీసుకొంటూనే ఉన్నారు. ఇంత గట్టి భద్రత తనకుందని సత్యరథుడికి తెలిసినా దైవపూజ విషయంలో నిర్లిప్తత, నిరాసక్తత కలిగాయి. అందుకు కారణం చేస్తున్న పూజ మీద అలసత్వం వల్ల ఏకాగ్రత లోపించటమే. దాంతో పూజ మధ్యలో లేచి బయటకొచ్చి చూశాడు.

🌸 అప్పటికే ఆ అలజడి చేసిన దుర్మర్షణుడు అనే శత్రురాజును సత్యరథుడి రక్షక భటులు బంధించి తేవటం, శత్రు సేనలను అణచటం కూడా జరిగింది. బంధితుడైన ఆ శత్రువుకు తగిన శిక్ష విధించాడు సత్యరథుడు. పూజ మధ్యలో లేచి వచ్చి ఇదంతా చేశాడు. చేయాల్సిన పనులన్నీ అయిపోయాక కూడా పూజ సంగతి రాజుకు గుర్తుకు రాలేదు. వెళ్ళి భోజనం చేసి నిద్రించాడు. ఇలా జరిగిన కొంతకాలానికి మరొక శత్రువు సత్యరధుడి రాజ్యం మీదకు దండెత్తాడు. రెండు సేనల నడుమ భీకర పోరాటం జరిగింది. ఈసారి శత్రువు చేతిలో సత్యరథుడు మరణించాడు. దాంతో రాజ్యం శత్రువుల హస్తగతమైంది. అతడి పట్టపు రాణి అప్పటికే నిండు చూలాలు. ఆమె రాజ మందిరం నుంచి ఎలాగో ఒకలాగా బయటపడి అడవి మార్గం పట్టింది. అలా ఎక్కువ దూరం నడవటానికి ఓపిక లేక ఓ సరస్సు తీరంలో చెట్ల నీడలో కూలబడింది. అక్కడే ఆమె ఒక మగ శిశువును ప్రసవించింది. తరువాత ఆమె మరణించింది.

s s consultancy

🌸 ఆ దోవన ఒక నిరుపేద వేద పండితుడి భార్య తన సంవత్సరం వయస్సున్న బాలుడిని ఎత్తుకొని వెళుతూ ఆ మగ శిశువును చూసింది. ఆ శిశువును ఆమె చేరే సరికి సరస్సులోని మొసలి వచ్చి రాజు భార్యను సరస్సులోకి లాక్కు వెళ్ళింది. దాంతో వేద పండితుడి భార్య ఆ పసికందు ఎవరో, ఏమిటో అర్థం కాక అతడిని తీసుకు వెళ్ళాలో, అక్కడే వదిలి వెళ్ళాలో తెలియక అయోమయంలో పడింది. ఇంతలో ఓ భిక్షువు అటుగా వచ్చి ఆ బాలుడిని తీసుకు వెళ్ళి పెంచుకోమని, అలా చేస్తే భవిష్యత్తులో ఎంతో మంచి జరుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు.

🌸 దాంతో ఆమె ఆ పసికందును తన వెంట తీసుకు వెళ్ళి తన కుమారుడితో సమానంగా పెంచసాగింది. ఇలా కొంతకాలం గడిచింది. ఓ రోజున వేద పండితుడి భార్య ఇద్దరు పిల్లలను తీసుకొని ఒక దేవాలయంలోకి వెళ్ళింది. అక్కడికే అదే సమాయానికి గొప్ప గొప్ప మునులు వచ్చారు. ఆ మునులలో శాండిల్యుడు అనే ముని, వేద పండితుడి భార్య దగ్గర పెరుగుతున్న బాలుడిని చూసి విధి ఎంత విచిత్రం, రాజకుమారుడు ఇలా బతకాల్సి వచ్చింది అన్నాడు.

🌸 ఆ స్త్రీ శాండిల్యుడికి నమస్కరించి తనకా పిల్లవాడు దొరికిన సంగతిని వివరించి ఆ బాలుడు ఎవరు అని అడిగింది. ముని దివ్య దృష్టి వల్ల తాను తెలుసుకొన్న విషయాన్నంతా చెప్పాడు. అప్పుడామె అంతటి మహారాజు ఎందుకలా శత్రువుల చేతిలో మరణించాల్సి వచ్చింది ? రాజు కుమారుడైన ఈ బాలుడు అనాథగా ఎందుకు బతకాల్సి వచ్చింది ? రాజు భార్య దుర్మరణం పాలు కావటానికి కారణమేమిటి ? అని అడిగింది.

🌸 అప్పుడు శాండిల్యుడు రాజు శివ పూజ చేస్తూ భక్తితో ప్రవర్తించక పూజ మధ్యలో ఆపి వేయటం వల్ల అన్ని కష్టాలు పొందాడన్నాడు. రాజ కుమారుడు కూడా గత జన్మలో రాజ కుమారుడేనని, అయితే ఆ జన్మలో అతడు కూడా శివ పూజను మధ్యలో ఆపటం, వెళ్ళి వేరే పనులు చేసుకుని తిని నిద్ర పోవటం లాంటివి చేశాడని, ఆ పాప ఫలితమే అతడు అనాథ కావటానికి కారణమన్నాడు. ఇక రాజు భార్య కూడా గత జన్మలో తన సవతి మీద అసూయతో ఆమెను మోసం చేసి చంపిందని, ఆ కారణం చేతనే ఆమె ఆ జన్మలో అలా దుర్మరణం పాలైందని అన్నాడు. రాజ కుమారుడు భవిష్యత్తులో మళ్ళీ రాజ్యం పొంది రాజుగా అవుతాడని, అయితే అతడి చేత భక్తితో పూజలు చేయించమని శాండిల్యుడు వేద పండితుడి భార్యకు చెప్పి వెళ్ళి పోయాడు.

🔱 శివానందా రూపం శివం శివం 🔱

* This is the Skanda Purana Brahmottara Khandam *

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.