hyderabad

High demand for fine-variety paddy; purchases being made right at the fields! Price per quintal: ₹3,500

By ·

Share this article
High demand for fine-variety paddy; purchases being made right at the fields!  Price per quintal: ₹3,500

 

సన్న వడ్లకు భలే గిరాకీ, పొలాల వద్దే కొనుగోళ్లు!                                                                                             

క్వింటాల్ ధర రూ.3500
 

 టీ మీడియా, అక్టోబర్ 24 , హైదరాబాద్ బ్యూరో : ఓవైపు ఎల్‌నినో ప్రభావం మరోవైపు భూగర్భ జలాలు అడుగంటడంతో పంట దిగుబడులపై మెదక్ జిల్లాలో ప్రతికూల ప్రభావం పడినప్పటికీ సన్న రకం ధాన్యం పండించిన రైతులకు మాత్రం మార్కెట్‌లో మంచి డిమాండ్ లభిస్తోంది. గతంలో వడ్లను అమ్ముకోవాలంటే కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ సీన్ పూర్తిగా మారింది. రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే వ్యాపారులే నేరుగా పొలాల వద్దకు వచ్చి ధాన్యం కొనుగోలు చేసి అక్కడికక్కడే నగదు ముట్టచెబుతున్నారు. దీంతో రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు, రోజుల తరబడి ఎదురుచూసే బాధలూ తప్పాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ సన్న వడ్లకు ఇంత డిమాండ్ ఎందుకు? మార్కెట్​ ధాన్యం పరిస్థితులపై ప్రత్యేక కథనం.

ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు
రాష్ట్రవ్యాప్తంగా సన్న వడ్లు పండించిన రైతన్నకు ఈసారి మార్కెట్‌లో మంచి గిరాకీ కనిపిస్తోంది. ధాన్యం నాణ్యతగా ఉంటే చాలు కొనుగోలు చేసేందుకు వ్యాపారులే రైతుల వద్దకు క్యూ కడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​తో పాటు మహారాష్ట్రకు చెందిన పలువురు వ్యాపారులు నేరుగా గ్రామాల్లోని పొలాల వద్దకు వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.

క్వింటాల్‌కు రూ.3,300 నుంచి రూ.3,500
మెదక్ జిల్లాలోని పలు గ్రామాల్లో గ్రేడ్‌-ఏ సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.3,300 నుంచి రూ.3,500 వరకు ధర పలుకుతుందని రైతులు ఆనందంతో చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే క్వింటాల్‌కు సుమారు రూ.1000 వరకు అదనంగా లభిస్తుండటంతో అన్నదాతలు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈసారి పంట దిగుబడి తగ్గినప్పటికీ ధర కొంత ఎక్కువగా వస్తుండటంతో నష్టాల బారిన పడకుండా తప్పించుకోగలిగామని చెబుతున్నారు.

గతంలో వరి కోతలు మొదలైనప్పటి నుంచి రైతులకు పరీక్ష మొదలయ్యేది. ధాన్యాన్ని ట్రాక్టర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలకు తరలించడం. అక్కడ కుప్పలు పోసి కాంటా కోసం రోజుల తరబడి ఆరబెట్టి ఎదురుచూడటం. అకాల వర్షాలు వస్తాయేమోనని ఆందోళన చెందడం. ధాన్యాన్ని కాపాడుకునేందుకు తంటాలు పడాల్సి వచ్చేది. చివరకు ధాన్యం అమ్మిన తర్వాత డబ్బులు ఎప్పుడు ఖాతాలో పడతాయోనని బ్యాంకుల చుట్టూ తిరగడం జరిగేది. కానీ ఈసారి పరిస్థితి కొంత భిన్నంగా మారింది. పంట కోతలు పూర్తికాకముందే వ్యాపారులే పొలాల వద్దకు చేరుకుని ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో రైతులకు ఖర్చులు కలిసోస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి తప్పిందని రైతులు చెబుతున్నారు.

బహిరంగ మార్కెట్‌లోనే అమ్మకాలు
ఈ ఖరీఫ్ సీజన్‌లో గ్రేడ్‌-ఏ ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2,461 కనీస మద్దతు ధర నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఏడు రకాల సన్న వడ్లకు దీనికి అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించింది. అయితే మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వ్యాపారులు నాణ్యతకు అనుగుణంగా క్వింటాల్‌కు రూ.3,300 నుంచి రూ.3,500 వరకు ధర చెల్లిస్తున్నట్లు రైతులు తెలిపారు. దీంతో ప్రభుత్వ మద్దతు ధర, బోనస్‌ కోసం ఎదురు చూడకుండా బహిరంగ మార్కెట్‌లో లభిస్తున్న ధరలకే రైతులు ధాన్యాన్ని విక్రయిస్తున్నారు.

మొత్తానికి దిగుబడులపై ప్రకృతి ప్రభావం చూపినా, సన్న వడ్లకు పెరిగిన డిమాండ్ రైతులకు కొంత ఊరటనిస్తోంది. కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షణకు బదులు పొలాల వద్దకే వస్తున్న వ్యాపారులు, తగ్గుతున్న అదనపు ఖర్చులు రైతుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. పంట దిగుబడి వచ్చినప్పుడు ఈ ధరలు ఉంటే రైతులకు ఆదాయం మరింత పెరిగి తమ కుంటుంబాలు ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధిస్తాయని చెబుతున్నారు. అయితే ఈ డిమాండ్ ఎంతకాలం కొనసాగుతుంది? రైతులకు లభిస్తున్న ధరలు రానున్న రోజుల్లోనూ నిలకడగా ఉంటాయా? అనే అంశాలపై వేచి చూడాలి.

Tags: